నీటి సరఫరా బంద్.. సోషల్ మీడియా వదంతులపై జలమండలి సీరియస్ వార్నింగ్!

water supply

water supply

water supply: వచ్చే నెల నుంచి హైదరాబాద్ నగరంలో మంచి నీటి సరఫరా నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) తీవ్రంగా స్పందించింది. ఇటువంటి ప్రచారాలు కేవలం వదంతులేనని, నగరవాసులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని.. నవంబర్ చివరి నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాను నిలిపివేస్తారని లేదా పరిమితం చేస్తారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ అంశంపై ప్రకటన విడుదల చేసిన జలమండలి.. ఈ సందేశాలను తీవ్రంగా ఖండించింది. ఇటువంటి సందేశాలను జలమండలి జారీ చేయలేదని తేల్చిచెప్పింది.

జలమండలి పేరుతో వచ్చే నిర్ధారణ లేని అసత్య సమాచారాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని సూచించింది. నగరంలో నీటి సరఫరాకు సంబంధించిన అధికారిక వివరాలు, సూచనల కోసం జలమండలి అధికారిక ప్రకటనలు మరియు సమాచార మార్గాలను మాత్రమే నిశితంగా గమనించాలని స్పష్టం చేసింది.