ఎమ్మెలసీ బరిలో ‘తెలంగాణ రక్షణ సేన’ తొలి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్

MLC Candidate

MLC Candidate

MLC Candidate: తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కొత్తగా ఏర్పాటైన ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. త్వరలో జరగబోయే వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దసరా పండుగ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల కో-ఆర్డినేటర్, అబ్జర్వర్‌గా సయ్యద్ ఇస్మాయిల్‌ను నియమిస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవి పల్లికి చెందిన శ్రీకాంత్ గౌడ్ కాకతీయ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఆయన, తెలంగాణ జాగృతి ఆవిర్భావం నుండి కల్వకుంట్ల కవితకు వెన్నంటి నిలిచారు. పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ ఛానెళ్ల డిబేట్లలో, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ గొంతుకగా నిలుస్తున్నారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారిగా శాసన మండలి ఎన్నికల బరిలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్న కవిత, పార్టీ తరఫున పోటీ చేసే తొలి అభ్యర్థిగా బిసి బిడ్డ శ్రీకాంత్ గౌడ్ పేరును ఖరారు చేశారు. బహుజనుల గొంతుకగా దశాబ్దాలుగా అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసిన కవిత, అదే సంప్రదాయాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనలోనూ కొనసాగించారని పార్టీ తమ ప్రకటనలో పేర్కొంది.