‘మినిట్ 2 మినిట్’ కథనం ప్రభావం.. ఎల్బీ నగర్ ఎస్పీ ఎదుట గుంతల మాయం!

LB Nagar

LB Nagar

LB Nagar: ప్రజా సమస్యలపై ‘మినిట్ 2 మినిట్’ ప్రచురించిన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతల వల్ల వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న తీవ్ర అవస్థలపై ‘మినిట్ 2 మినిట్’ పత్రికలో వచ్చిన కథనం ఐ ఆపనర్‌గా నిలిచింది. పత్రికలో వార్త ప్రచురితమైన వెంటనే సంబంధిత పురపాలక, రహదారుల శాఖ అధికారులు యంత్రాంగాన్ని రంగంలోకి దించారు.

బుధవారం ఉదయమే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కోన్లను ఏర్పాటు చేసి యుద్దప్రాతిపదికన రోడ్డుపై ఉన్న ప్రమాదకర గుంతలను పూడ్చే చర్యలు చేపట్టారు. రహదారి మరమ్మతులు పూర్తి చేయడంతో ట్రాఫిక్ రాకపోకలు సులభతరమై, ప్రయాణికులు తీవ్ర ఉపశమనం పొందారు.

ప్రజా సమస్యను సమర్థవంతంగా వెలికితీసి పరిష్కారమయ్యేలా చేసిన ‘మినిట్ 2 మినిట్’ బృందానికి స్థానికులు, వాహనదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పరిసర ప్రాంతాల్లోని మిగిలిన రోడ్డు గుంతల పూడ్చివేత పనులను కూడా త్వరలోనే మరింత వేగవంతం చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.