రక్షకుడే భక్షకుడైతే! సీజ్ చేసిన సొత్తునే నొక్కేసిన కానిస్టేబుల్.. మీర్‌పేటలో ఖాకీ దొంగతనాల భాగోతం

Meerpet

Meerpet

Meerpet: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారే దొంగతనానికి పాల్పడి కటకటాలపాలైన షాకింగ్ సంఘటన నగరంలోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఓ కేసు విచారణలో భాగంగా రికవరీ చేసి సీజ్ చేసిన సొత్తునే కానిస్టేబుల్ నొక్కేయడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది.

మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రవణ్ ఓ కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన మొబైల్ ఫోన్, 12 తులాల బంగారాన్ని పోలీస్‌స్టేషన్‌లో భద్రపరచకుండా తన వద్దే ఉంచుకున్నాడు. అనంతరం సీజ్ చేసిన మొబైల్ ఆధారంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా రూ. 1.70 లక్షల నగదును తన సమీప బంధువుల బ్యాంకు ఖాతాలకు రహస్యంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా, పోలీసుల స్వాధీనంలో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను తన వ్యక్తిగత అవసరాల కోసం ఏకంగా కుదువ పెట్టేశాడు.

ఈ మొత్తం వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితులు వెంటనే ఉన్నతాధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, కానిస్టేబుల్ శ్రవణ్ సదరు మొబైల్ ద్వారా తన బంధువుల ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్లు పక్కా ఆధారాలు లభించాయి. దీంతో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి అక్రమాలకు పాల్పడిన కానిస్టేబుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రక్షకుడే భక్షకుడిగా మారిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.