Telugu Univesity: ప్రైవేటుకు అప్పగిస్తే సహించం.. తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి

telugu-university-nampally-campus-protest

హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను సహించేది లేదని తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి స్పష్టం చేసింది. బాచుపల్లికి వర్సిటీని తరలించాక నాంపల్లి ప్రాంగణం ఖాళీగా ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సమితి ప్రతినిధులు ఖండించారు. మ్యూజియం పేరుతో ఈ ప్రాంగణాన్ని అప్పగించే ప్రయత్నాలు విరమించుకోవాలని, ఇక్కడ వివిధ కోర్సులు అభ్యసిస్తున్న 2,500 మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కళల కాణాచి అయిన ఈ విశిష్ట సంస్థను ఇతర అవసరాలకు వాడటం సరికాదని, ఆక్రమణలకు ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వాస్తవాలను పరిశీలించి, నాంపల్లి, బాచుపల్లి రెండు ప్రాంగణాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.