- మానేరు వాగుపై రూ. 77 కోట్లతో మహా బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- ఏండ్లుగా అలుపెరగని పోరాటానికి లభించిన చరిత్రాత్మక విజయం
- కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా త్వరలో శంకుస్థాపన!
గన్నేరువరం: గన్నేరువరం మండల ప్రజల ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు, ప్రజా చైతన్య పోరాటాలకు ఎట్టకేలకు అద్భుత విజయం లభించింది. గన్నేరువరం నుంచి కరీంనగర్ వెళ్లేందుకు మానేరు వాగుపై నిర్మించ తలపెట్టిన భారీ వంతెన (బ్రిడ్జి) పనులకు సర్వం సిద్ధమైంది. త్వరలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ చరిత్రాత్మక బ్రిడ్జి నిర్మాణానికి అత్యంత వైభవంగా శంకుస్థాపన జరగనుంది. ప్రస్తుతం శంకుస్థాపన స్థలంలో శిలాఫలకం ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
సుదీర్ఘ పోరాటం.. – సాధన సమితి గర్జన
గత కొన్నేండ్లుగా గన్నేరువరం మండల కేంద్రానికి బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు, నాయకులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా 2019 ఎంపీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ కుమార్ గన్నేరువరం వచ్చిన సందర్భంగా ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించి, మాట ఇచ్చారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో రెండోసారి గెలిచి కేంద్ర మంత్రి కావడం, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తోడుకావడంతో ఈ ప్రతిపాదనలకు మోక్షం లభించింది. 2025లో రూ. 77 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
మలుపు తిప్పిన రెండో దశ ఉద్యమం
మధ్యలో ఈ బ్రిడ్జి చొక్కారావుపల్లి నుండి కాజీపూర్ మీదుగా మంజూరు కావడంతో గన్నేరువరం ప్రజల ఉత్సాహం నీరుగారింది. తక్షణమే అప్రమత్తమైన ‘బ్రిడ్జి సాధన సమితి’ రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించి “చొక్కారావుపల్లి బ్రిడ్జి వద్దు.. గన్నేరువరం బ్రిడ్జి ముద్దు” అనే నినాదంతో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చింది. చివరకు ప్రజా సంకల్పమే గెలిచి, గన్నేరువరం కేంద్రంగానే బ్రిడ్జి నిర్మించేలా అనుమతులు సాధించారు.
కేంద్రం ఉత్తర్వులు – టెండర్లు ఖరారు
ఈ ఏడాది మే 13న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆఫీస్ మెమోరండం ద్వారా వంతెన నిర్మాణానికి తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసి మే నెలలోనే టెండర్లు పిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ ‘సాయి పావని కన్‌స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రూ. 61 కోట్ల 86 లక్షలకు ఈ ప్రతిష్టాత్మక బ్రిడ్జి నిర్మాణ పనులను దక్కించుకుంది. ఈ భారీ వంతెన నిర్మాణంతో గన్నేరువరం మండల కేంద్రం రూపురేఖలు మారిపోనున్నాయి. కరీంనగర్ నగరానికి రవాణా సౌకర్యం సులువు కావడమే కాకుండా, వ్యాపార, వాణిజ్య రంగాలు ఊపందుకోనున్నాయి. ఈ చారిత్రాత్మక విజయంతో గన్నేరువరం మండల వ్యాప్తంగా ప్రజలు, సాధన సమితి నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు.
ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలి: తిప్పర్తి
మూడు మండలాల ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు గన్నేరువరం ప్రజల పక్షాన బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ చొరవ లేకపోతే బ్రిడ్జి నిర్మాణం సాధ్య పడేది కాదని, ఎన్నికల్లో మాట ఇచ్చి బ్రిడ్జి మంజూరు చేయించి నిలబెట్టుకునికి శంకుస్థాపనకు వస్తున్న సంజయ్ కి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలకాలని నికేశ్ పిలుపునిచ్చారు.
