Gattem Venkatesh: కళకు సరిహద్దులు లేవని, సృజనాత్మక ప్రతిభ ఉంటే జగత్తును తన వైపు తిప్పుకోవచ్చని ప్రఖ్యాత సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ విజేత డాక్టర్ గట్టెం వెంకటేశ్ మరోసారి నిరూపించారు. అమెరికాలోని చికాగోలో ఉన్న ‘ఓసిస్ ఫ్రెష్’ ప్రాంగణంలో ఆయన తీర్చిదిద్దిన సరికొత్త మ్యూరల్ వాల్ ఆర్ట్ అక్కడి ప్రవాసులతో పాటు స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సహజసిద్ధమైన వృక్షం, విస్తరించిన కొమ్మలు, పచ్చని ఆకులతో కూడిన ఈ అద్భుత సృష్టి అక్కడి వాతావరణానికి ప్రత్యేకమైన జీవకళను తీసుకువచ్చింది. కేవలం పెన్సిల్ మొనలపై సూక్ష్మ రూపాలను చెక్కడమే కాకుండా, తన కుంచెతో భారీ గోడలపైనా అద్భుతాలు ఆవిష్కరించగలనని ఆయన స్వయంగా నిరూపించారు.
సాధారణ గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా చిన్నదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేశ్ స్వయంకృషితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. చిన్నతనం నుంచే కళపై మక్కువతో పెన్సిల్స్, చాక్ పీసులు, క్రేయాన్స్, వెదురు బొంగులు, అగ్గిపుల్లల చివరలపై సూక్ష్మకళాకృతులను ఆవిష్కరించడంలో ప్రత్యేక నైపుణ్యం సాధించారు. వ్యర్థ పదార్థాలతో అందమైన ఆర్కిటెక్చరల్ మోడళ్లను తయారు చేయడంలోనూ ఆయన సిద్ధహస్తులు. విద్యాభ్యాసంలోనూ రాణించిన ఆయన 2019లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, 2021లో అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన కళాసేవకు గుర్తింపుగా జర్మనీలోని ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ 2019లో గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
రికార్డుల వీరుడు.. నిరంతర కళాసేవకుడు
తన అసాధారణ నైపుణ్యంతో 2014లో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించిన వెంకటేశ్, 2017లో ప్రతిష్టాత్మకమైన ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ సాధించి అంతర్జాతీయంగా తెలుగువారి కీర్తిపతాకాన్ని ఎగురవేశారు. తన ప్రతిభను ప్రదర్శనలకే పరిమితం చేయకుండా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు, సూక్ష్మ కళపై అవగాహన పెంచేందుకు క్రమం తప్పకుండా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. చికాగోలోని ‘ఓసిస్ ఫ్రెష్’ వేదికగా ఆవిష్కృతమైన ఈ మ్యూరల్ వాల్ ఆర్ట్ ప్రపంచ వేదికపై తెలుగు కళాత్మకతకు దక్కిన మరొక గొప్ప గౌరవంగా నిలిచింది.
