కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక గ్రంథంలో శ్రీశైల మహాక్షేత్ర మహిమలు!

Srisailam Temple

Srisailam Temple

Srisailam Temple: అనాదిగా భక్తుల గుండెల్లో కొలువైన శ్రీశైల మహాక్షేత్ర మహిమలకు కేంద్ర స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన భాషా విభాగం శివతత్త్వంపై ప్రతిష్ఠాత్మకంగా ప్రచురించిన “శివ: అనాదిహై అనంత్‌హై” అనే ప్రత్యేక గ్రంథంలో శ్రీశైల క్షేత్ర మహత్యం విశేషంగా చోటుచేసుకుంది. ఈ గ్రంథంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు స్వయంగా రచించిన వ్యాసం ప్రచురితం కావడం విశేషం. ఈ అరుదైన ప్రచురణ ద్వారా శ్రీశైలం ఘనత జాతీయ స్థాయిలో సరికొత్త వెలుగులోకి వచ్చింది.

నవీ ముంబై వేదికగా అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరణ

ఇటీవల నవీ ముంబైలో వైభవంగా నిర్వహించిన 6వ అఖిల భారత అధికార భాషా సదస్సు వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ విశిష్ట గ్రంథాన్ని ఆవిష్కరించారు. భగవంతుని తత్త్వాన్ని బహుముఖ కోణాల్లో ఆవిష్కరించే ఈ ప్రచురణలో శ్రీశైలానికి ప్రత్యేక స్థానం కల్పించడం వెనుక క్షేత్ర పవిత్రత, ప్రాచీనత ఎంతగానో ఉన్నాయని తెలుస్తోంది. దేశంలోని మూలమూలల నుండి వచ్చే ఆధ్యాత్మిక వేత్తలు, పరిశోధకులకు ఈ గ్రంథం శ్రీశైల విశేషాలను ప్రత్యక్షంగా పరిచయం చేయనుంది.

ఏక ప్రాంగణంలో జ్యోతిర్లింగం, మహాశక్తి పీఠం – ప్రత్యేకతల సమాహారం

శ్రీ రమేష్‌నాయుడు తన వ్యాసంలో శ్రీశైలం ప్రాశస్త్యాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఆలయ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబ అమ్మవారు కొలువుదీరడం ఈ క్షేత్రానికే లభించిన అరుదైన వరం. ‘ఇలకైలాసంగా’ భక్తులు పూజించే ఈ ధామం వైదిక సంకల్పాల్లో ప్రధాన కేంద్రంగా వెలుగుందుతోంది. స్వామి అమ్మవార్ల ఆవిర్భావ విశేషాలతో పాటు, నల్లమల అడవులలో లభించే అరుదైన వృక్ష సంపద, భౌగోళిక ప్రాముఖ్యత, తరతరాల చరిత్ర, సంస్కృతి మరియు స్థానిక దర్శనీయ ప్రదేశాల గురించి ఈ వ్యాసంలో క్షుణ్ణంగా వివరించారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీశైల ప్రాచారానికి సరికొత్త మార్గం

హిందీ భాషలో వెలువడిన ఈ గ్రంథం ప్రచురణ ద్వారా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో శ్రీశైల ధామ విశేషాలకు విశేషమైన ప్రాచుర్యం లభించనుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు, పర్యాటకులకు శ్రీశైలం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ విశిష్ట వ్యాసం ప్రచురణతో క్షేత్ర వైభవం ఎల్లలు దాటి మరిన్ని కోట్ల మంది శివభక్తులకు చేరువవుతుందనడంలో సందేహం లేదు.