Hyderabad Cleanliness: హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అత్యంత పరిశుభ్రమైన, ట్రాఫిక్ రహిత నగరంగా (క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీ) తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పురపాలక శాఖ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పారిశుద్ధ్యం, సులభతర రవాణాపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడా చెత్త దిబ్బలు కనిపించకుండా ప్రతిరోజూ పక్కాగా ఇంటింటికీ చెత్త సేకరణ ప్రక్రియ సాగాలని, ఈ పనుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భాగ్యనగర పరిధిలోని నిర్మాణ వ్యర్థాల (C&D Waste) తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో వ్యర్థాల సేకరణ కోసం ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. మరోవైపు పర్యావరణ పరిరక్షణ, తాగునీటి పొదుపు లక్ష్యంగా జలమండలి అందుబాటులోకి తెచ్చిన రీసైకిల్డ్ నీటి వినియోగాన్ని మరింత పెంచాలన్నారు. పార్కులు, ప్లాంటేషన్లు, గార్డెనింగ్, నిర్మాణ పనులకు తాగునీటిని వాడకుండా ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటినే ఉపయోగించేలా ప్రజలు, సంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. తొలివిడతగా 19 ఎస్టీపీల నుంచి ప్రారంభించిన 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధికి విస్తరించాలని అధికారులకు మార్గదర్శనం చేశారు.
నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు గంటల తరబడి ఆగిపోకుండా నిరంతరాయంగా ప్రయాణం సాగేలా సిగ్నల్ రహిత వ్యవస్థను రూపుదిద్దాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
