గాల్లో తేలుతున్న కరెంట్ స్తంభాలు.. ప్రెస్టిజ్ నిర్మాణంలో దారుణం.. డేంజర్ బెల్స్!

Power Poles

Power Poles

Power Poles: పైకి మెరిసే హంగులు.. కోట్ల రూపాయల బిజినెస్ ప్రాజెక్టులు.. నగరంలో ప్రెస్టిజ్ కన్‌స్ట్రక్షన్స్ అంటేనే ఓ పెద్ద బ్రాండ్. కానీ, క్షేత్రస్థాయిలో వారు చేస్తున్న పనులు, వాటికి సహకరిస్తున్న విద్యుత్ శాఖ అధికారుల తీరు చూస్తే మాత్రం సామాన్య ప్రజల ప్రాణాలు వారికి పూచిక పుల్లతో సమానమనే అనుమానం కలగక మానదు. ఆటోనగర్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ ఫేజ్-2లో ఉన్న ప్రెస్టిజ్ సంస్థ ‘ట్రైడెంట్ నమిశ్రీ’ (Trident by Namishree) పేరుతో చేపడుతున్న భారీ నిర్మాణ పనుల్లో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొంది.

నిర్మాణ స్థలంలో బేస్‌మెంట్ కోసం పెద్ద ఎత్తున మట్టిని తవ్వి తీశారు. అయితే, అక్కడే ప్రధాన విద్యుత్ సరఫరా లైన్లతో ఉన్న కరెంట్ స్తంభాలను సురక్షిత ప్రాంతానికి మార్చాల్సింది పోయి, వాటి చుట్టూ ఉన్న మట్టి మొత్తాన్ని తవ్వేసి, కేవలం ఒక చిన్న పిల్లర్ లాంటి మట్టి దిబ్బపై ఆ స్తంభాలను అలాగే గాలిలో వదిలేశారు. ఫోటోల్లో చూస్తేనే గుండె గుభేల్‌మనేలా ఉంది ఆ దృశ్యం. చిన్నపాటి వర్షం పడినా లేదా అక్కడ జేసీబీ భారీ వాహనాలు కదిలినా ఆ మట్టి దిబ్బ కూలిపోవడం ఖాయం. ఆ కరెంట్ పోల్ కిందపడితే భారీ విద్యుత్ ప్రమాదంతో పాటు మన్సూరాబాద్ గ్రామానికంతటికీ కరెంట్ సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది.

ఇంతటి ఘోరం జరుగుతున్నా స్థానిక విద్యుత్ శాఖ అధికారులు కనీసం అటువైపు కన్నుఎత్తి చూడకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. ప్రాణాపాయ స్థితి స్పష్టంగా కనిపిస్తున్నా నిబంధనలను బుట్టదాఖలు చేసి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి చేతులు ముడుచుకుని కూర్చున్నారు. ఈ విషయమై స్థానిక అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) శంకర్‌ను నిలదీయగా.. “కంబాలు మార్చే బాధ్యత ప్రెస్టిజ్ వారిదే.. దానికి కావాల్సిన సొమ్ము కూడా డిపాజిట్ చేశారు. కాంట్రాక్టర్ ఆలస్యం చేయడం వల్లే పనులు ఆగాయి. మా వంతు బాధ్యత మేము పూర్తి చేశాం” అంటూ సమాధానమిచ్చారు.

సొమ్ము చెల్లిస్తే తమ బాధ్యత తీరిపోయిందా? ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులకు లేదా? ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాక విచారణలు జరుపుతారా? అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ మూల్యం చెల్లించుకోకముందే ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, ఆ విద్యుత్ స్తంభాలను సురక్షిత ప్రాంతానికి మార్చి, ఈ నిర్లక్ష్యానికి కారణమైన కాంట్రాక్టర్, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.