23 అడుగుల మంచు కురిసినా ఆగని జనజీవనం.. ఆమోరి నగరం ప్రత్యేకత ఏమిటి?

Snowfall

Snowfall

Snowfall: మంచు కొండలు, శీతల వాతావరణం అనగానే మనకు స్విట్జర్లాండ్ లేదా హిమాలయాలు గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచంలోనే అత్యధికంగా మంచు కురిసే నగరం ఎక్కడ ఉందో తెలుసా? అది జపాన్‌లోని ‘ఆమోరి’ (Aomori). ఉత్తర జపాన్‌లోని ఆమోరి ప్రిఫెక్చర్‌కు రాజధాని అయిన ఈ నగరం శీతాకాలంలో మంచు తెలుపు రంగులో ముస్తాబవుతుంది. ఇక్కడ ఏటా సగటున 6 నుంచి 7 మీటర్లు, అంటే దాదాపు 23 అడుగుల ఎత్తు వరకు మంచు పడుతుంది. 2020 నుండి 2024 మధ్య సగటున 505.6 సెంటీమీటర్ల హిమపాతం నమోదై, సమీప నగరాలైన అసహికవా, సపోరోలను కూడా దాటేసి ప్రపంచంలోనే అత్యంత హిమపాతం నమోదయ్యే నగరంగా నిలిచింది.

మంచు కురవడానికి అసలు కారణం ఏంటి?

ఆమోరి నగరం జపాన్ ప్రధాన ద్వీపమైన హోన్షు ఉత్తర కొన భాగంలో ఉంది. శీతాకాలంలో సైబీరియా నుంచి వీచే అత్యంత గడ్డకట్టించే చల్లని గాలులు, జపాన్ సముద్రం మీదుగా పయనిస్తాయి. ఈ క్రమంలో సముద్రంలో ఉన్న తేమను ఆ గాలులు శోషించుకుంటాయి. ఆ తర్వాత ఆ గాలులు ఆమోరి చుట్టూ ఉన్న హక్కోడా పర్వతాలను తాకినప్పుడు మేఘాలుగా మారి, నిరంతరం భారీ మంచు రూపంలో కిందకు కురుస్తాయి. సైబీరియా గాలులు, సముద్రపు తేమ, స్థానిక పర్వతాల కలయికే ఈ నగరానికి ఐస్ కేఫ్ రూపాన్ని ఇస్తుంది.

నిలువెత్తు మంచు గోడలు… ఆశ్చర్యపరిచే సాంకేతికత

ఇంతటి తీవ్రమైన మంచు కురుస్తున్నప్పటికీ ఆమోరి నగరం ఎక్కడా స్తంభించిపోదు. ఇక్కడే జపాన్ ఇంజనీరింగ్ అద్భుతం కనిపిస్తుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘స్నో కంట్రోల్’ వ్యవస్థను నిర్వహిస్తుంది. భారీ మంచు తొలగింపు యంత్రాలు (Snow Plows) నిరంతరం రోడ్లపై తిరుగుతూ మంచును తొలగిస్తాయి. ఇక్కడ రాత్రికి రాత్రే రోడ్ల పక్కన మంచును ఎత్తుగా పెంచి తయారుచేసే “మంచు గోడలు” (Snow Walls) ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. బస్సులు, కార్లు రెండు వైపులా ఎత్తైన మంచు కొండల మధ్య ప్రయాణిస్తున్న అనుభూతి ఇక్కడ మాత్రమే లభిస్తుంది.

ప్రతికూలతనే పండగలా మార్చుకున్న ప్రజలు

సాధారణంగా కొద్దిపాటి మంచు పడితేనే అనేక దేశాల్లో జనజీవనం స్తంభించిపోతుంది. కానీ ఆమోరి ప్రజలు ఈ మంచును శాపంగా కాక వరంగా భావిస్తారు. విద్యాసంస్థలు, ఆఫీసులు, రైలు రవాణా వ్యవస్థలు ఎలాంటి ఆటంకం లేకుండా తమ పని తాము చేసుకుపోతాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే “ఆమోరి వింటర్ ఫెస్టివల్”, మంచు శిల్పాల ప్రదర్శనలు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రకృతి సృష్టించే విచిత్రమైన వాతావరణాన్ని తమ క్రమశిక్షణ, అత్యాధునిక సాంకేతికతతో జయించిన ఆమోరి నగరం నిజంగా మానవ పట్టుదలకు నిదర్శనం!