ట్యాంకర్లు బంద్.. చదువులు బంద్.. హైదరాబాద్ హాస్టళ్లలో నీటి తిప్పలు!

Water Crisis

Water Crisis

Water Crisis: రాజధాని హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టళ్లకు తీవ్రమైన నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని ప్రధాన విద్యా, ఉద్యోగ కేంద్రమైన అమీర్‌పేట్, సంజీవరెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ హాస్టళ్లకు వాటర్ ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో హాస్టల్ యజమానులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాటర్ బోర్డు ట్యాంకర్లను నిలిపివేయడంతో నిత్యవసర అవసరాలకు నీళ్లు లేక హాస్టళ్లలో ఉంటున్న వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు అల్లాడిపోతున్నారు.

ఈ సమస్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అమీర్‌పేట్ వెల్ఫేర్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఎస్ఆర్ నగర్‌లోని వాటర్ వర్క్స్ కార్యాలయానికి తరలివెళ్లారు. అక్కడ జనరల్ మేనేజర్‌ను కలిసి తమ నిరసనను వ్యక్తం చేస్తూ వినతిపత్రం సమర్పించారు. గత రెండు రోజులుగా నీటి సరఫరా పూర్తిగా బంద్ కావడంతో హాస్టళ్ల నిర్వహణ దారుణంగా తయారైందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.

స్నానాలకు, తాగునీటికి, కనీస పరిశుభ్రతకు నీళ్లు దొరక్క హాస్టళ్లలోని విద్యార్థులను, ఉద్యోగులను ఇళ్లకు పంపించేసే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే హైదరాబాద్ నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. నీటి కొరత వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, ప్రైవేట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.