Rythu Bharosa: రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ అయినట్లు నకిలీ మెసేజ్లు రావడం మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వ పథకం కింద డబ్బులు పడ్డాయని సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారం రావడం, తీరా బ్యాంక్ ఖాతాలు పరిశీలించగా నగదు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
ఈ పరిస్థితిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం కిసాన్ నిధుల జమ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని, రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే నకిలీ మెసేజ్లు, అనుమానాస్పద లింకుల పట్ల రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఫోన్లకు వచ్చే ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని, సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు సూచించారు. ఇలాంటి ఫేక్ మెసేజ్లను నమ్మి ఖాతా వివరాలు పంచుకుంటే సొమ్ము కోల్పోయే ప్రమాదం ఉందని రైతులను అప్రమత్తం చేశారు.
