అక్షరాలపై బెదిరింపుల దాడి.. తగ్గేదే లేదంటున్న ‘మినిట్ 2 మినిట్’!

Press Freedom

Press Freedom

Press Freedom: సమాజంలో మట్టి మనుషుల జీవితాలు, సామాన్యుల అవస్థలు,  అధికారుల అవినీతి బాగోతాలు, బెట్టింగ్ మాఫియా, కన్సల్టెన్సీల లీలలు, పరిశ్రమల కాలుష్య కోరల్లో చిక్కుకున్న గ్రామాల స్థితిగతులపై ‘మినిట్ 2 మినిట్’ అందిస్తున్న నిష్పాక్షిక వార్తా కథనాలు అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మా అక్షరాలతో కలవరపడిన ఒక బ్యాచ్ తమ అసహనాన్ని నేడు వెళ్లగక్కింది. తమ అక్రమాలను ప్రశ్నిస్తూ రాసిన కథనాలపై పక్కా ఆధారాలతో సమాధానం చెప్పలేక, ఫోన్లు చేసి బెదిరించే ప్రయత్నం చేసింది.
‘మినిట్ 2 మినిట్’ ఎడిటర్ సతీశ్ నాయుడు, జర్నలిస్ట్ వరప్రసాద్ మేడిలకు ఫోన్ కాల్స్ (95050***, 98496*** నంబర్ల నుంచి) చేసి, అడ్రస్‌లు అడుగుతూ బెదిరింపు ధోరణిలో సదరు వ్యక్తులు మాట్లాడారు.

అక్షరంతో సావాసం చేసే విలేకరులకు ఆ అక్షరమే బలమైన ఆయుధం. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా వార్తలు రాసే పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తే దానికంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. సమాజంలో జరుగుతున్న దోపిడీలు, పిట్టంపల్లి వంటి గ్రామాలలో పరిశ్రమల వల్ల వినాశనమవుతున్న పర్యావరణం, అక్రమ బోర్ల తవ్వకాలు, యువత జీవితాలను గుల్ల చేస్తున్న బెట్టింగ్ దందాలపై మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.

మా రచనల్లో ఏవైనా దోషాలు లేదా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా కోర్టుల ద్వారా రావచ్చు, చట్టపరమైన నోటీసులు పంపవచ్చు. అంతే తప్ప, వెనుక నుంచి బెదిరింపులకు దిగితే భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాం. మా అక్షరాలకే భయపడితే, రోడ్డు మీద కొచ్చి గళం విప్పితే ఇంకెంత భయపడతారో? కబడ్దార్.. మేం దేనికీ భయపడేది లేదు. అక్షరమే మా ఆయుధం! మీ బెదిరింపులతో ప్రజా సమస్యలపై పోరాడే మా కలం మరింత పదునెక్కుతుందే తప్ప, ఏ శక్తికీ తలవంచదు. మినిట్ 2 మినిట్ ఎడిటర్‌గా సతీశ్ నాయుడు, జర్నలిస్ట్ వరప్రసాద్ మేడి చేస్తున్న అక్షర పోరాటానికి ప్రజాబలమే కొండంత అండ. ఈ బెదిరింపు కాల్స్ ఆధారాలను చట్టపరమైన చర్యల కోసం పోలీసు ఉన్నతాధికారులకు సమర్పిస్తున్నాం.