Admissions Scam: ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు వచ్చేలా చేస్తామని నమ్మబలికి అమాయక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న కన్సల్టెన్సీల దందాలపై అధికార యంత్రాంగం, ఉన్నత విద్యాశాఖ దృష్టి సారించాయి. నగరం కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ అడ్మిషన్ల దందాపై సమగ్ర ఉన్నతస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యోగితా రాణాకు ఆధారాలతో కూడిన ఫిర్యాదులు అందాయి.
ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలకమైన దారుణ స్కామ్ వెలుగుచూసింది. కౌన్సెలింగ్ కేంద్రాలలో కన్సల్టెన్సీలు తమ ప్రతినిధులను ఏర్పాటు చేసుకుని అక్రమ వెరిఫికేషన్ దందా నడుపుతున్నాయి. తగిన ప్రామాణిక పత్రాలు లేకున్నా, ఉన్నట్లుగా సిస్టమ్లో వెరిఫై టిక్ వేయించుకుంటూ భారీ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఓసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికేట్లు లేకపోయినా, ఇతర వర్గాల విద్యార్థులకు ఆదాయ ధృవీకరణ పత్రాలు లేకున్నా ఉన్నట్లుగా చూపిస్తూ అర్హులైన పేద విద్యార్థులకు దక్కాల్సిన సీట్లను దారి మళ్లిస్తున్నారు. కన్సల్టెన్సీల ఈ మాయాజాలం వల్ల నిజమైన అర్హత కలిగిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
గతంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డికి కొన్ని కన్సల్టెన్సీలపై ఫిర్యాదులు అందినప్పటికీ, స్థానిక యంత్రాంగం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా సేకరించిన పక్కా ఆధారాలను ప్రధాన కార్యదర్శి ముందు ఉంచారు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకోవడం, ఐదారేళ్లుగా అడ్మిషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం, నిలదీస్తే పొలిటికల్ ప్రాభవం, ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయని బెదిరింపులకు దిగడం వంటి పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గతంలోనూ ఓ బాధిత కుటుంబం ఇలాంటి అడ్మిషన్ మోసాలపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్లో పిర్యాదు చేసిన రికార్డులు లభ్యమయ్యాయి.
ప్రస్తుతం బాధితుల వాంగ్మూలాలు, ఆడియో-వీడియో రికార్డింగ్లు, ఫోటోలు, కన్సల్టెన్సీల అక్రమ కార్యకలాపాల ఆధారాల ప్రతులను విద్యాశాఖకు సమర్పించారు. విద్యావ్యవస్థను గుల్ల చేస్తూ రూ. కోట్ల నకిలీ అడ్మిషన్ల వ్యాపారం నడుపుతున్న ఇటువంటి అడ్మిషన్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీల బాగోతాలను బట్టబయలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రత్యేక నిఘా చర్యలు చేపడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఏ ఒక్క కన్సల్టెన్సీనీ వదిలేదే లేదని, త్వరలోనే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
