Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం వద్ద ఈ విషాద ఘటన జరిగింది. మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు మల్లన్న పాదయాత్ర కొనసాగుతుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ లారీ ఆయన కాన్వాయ్‌లోని కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న కారులో ప్రయాణిస్తున్న తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందన (23), రెండేళ్ల కుమారుడు, డ్రైవర్ సురేశ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చందన మృతి చెందారు. శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉంది.
మల్లన్న కారులో ఉన్న ఇద్దరికి సైతం గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఆ సమయంలో తీన్మార్ మల్లన్న కారులో లేకపోవడంతో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
