House Pattas: తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014కు ముందు వివిధ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు పొందిన సుమారు ఏడు లక్షల మంది లబ్ధిదారుల దశాబ్దాల నాటి నిరీక్షణకు ఎట్టకేలకు తెరదించింది. రుణాల మంజూరు సమయంలో గృహ నిర్మాణ సంస్థ వద్ద తనఖాలో ఉంచిన ఒరిజినల్ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
దశాబ్దాల నాటి కష్టాలకు విముక్తి:
గతంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప, వాంబే వంటి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు మంజూరైనప్పుడు, బ్యాంకులు మరియు హౌసింగ్ కార్పొరేషన్ రుణాల నిమిత్తం లబ్ధిదారుల ఒరిజినల్ పత్రాలను అధికారులు తమ వద్దే పెట్టుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆ పత్రాలు చేతికి అందకపోవడంతో లక్షలాది కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఒరిజినల్ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లు నేరుగా చేతికి రానుండటంతో ఆ ఇళ్లపై లబ్ధిదారులకు పూర్తి స్థాయి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లభించనున్నాయి.
ఆస్తుల బదలాయింపు ఇక సులభతరం:
ఇళ్ల పత్రాలు చేతిలో లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఆ ఇళ్లను అమ్ముకోవడానికి గానీ, పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, అత్యవసర వైద్య ఖర్చుల కోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి గానీ వీలుండేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ఆ అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అంతేకాకుండా, తల్లిదండ్రుల తదనంతరం వారసుల పేరిట ఆస్తులను బదలాయించుకోవడం కూడా ఇకపై అత్యంత సులభతరం కానుంది.
క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణ శాఖ అధికారుల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఎలాంటి జాప్యం లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ సర్టిఫికెట్లను అందజేయాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సర్కార్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల కుటుంబాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
