Kuntloor Accident: పెళ్లయ్యి నెలరోజులు కూడా కాకముందే, ఎండిన చెట్టు రూపంలో మృత్యువు ఆ యువకుడిని కబళించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలై, నవ వధువుకు తీరని శోకాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
నెల రోజుల ముచ్చటైనా తీరకముందే..
సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రహదారిపై వెళ్తున్న సాయి కుమార్(29) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిపై అక్కడే ఉన్న ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాయికి వివాహమై కేవలం నెల రోజులు మాత్రమే కావడంతో, ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు ఆనందంగా ఉన్న ఆ ఇంట ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మృతుడి బాబాయి రాధాకృష్ణ(48) తీవ్రంగా గాయపడ్డారు.
ముందే మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు!
ఈ ప్రమాదానికి మున్సిపల్, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు మండిపడుతున్నారు. రాజీవ్ గృహకల్ప పరిసరాల్లోని రహదారుల వెంట ఉన్న పలు చెట్లు ఎండిపోయి, ఎప్పుడు కూలుతాయో తెలియని స్థితిలో ఉన్నాయని కాలనీ వాసులు గతంలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. డీర్ పార్క్ సమీపంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులను నేరుగా కలిసి విజ్ఞప్తి చేసినా ఎవరూ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో ప్రాణం పోకముందే స్పందించాలి!
ప్రస్తుతం కూడా ఈ మార్గంలో మరికొన్ని ఎండిపోయిన చెట్లు మృత్యుపాశాల్లా వేలాడుతున్నాయి. తక్షణమే ఫారెస్ట్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని, భవిష్యత్తులో మరో కుటుంబానికి ఇలాంటి కడుపుకోత మిగలకుండా రక్షణ చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
