Egg Donation: నగరంలో తీవ్ర కలకలం రేపిన అక్రమ ‘ఎగ్ డొనేషన్’ (అండాల దానం) రాకెట్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలు ప్రముఖ ఐవీఎఫ్ (IVF) సెంటర్ల వైద్యులు, నిర్వాహకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.
మహిళల ఆరోగ్యంతో చెలగాటమా?:
విచారణ సందర్భంగా ఐవీఎఫ్ కేంద్రాల నిర్వాహకుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, తాము నిబంధనలకు అనుగుణంగానే అండాల సేకరణ జరిపామని, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
పేద, మధ్యతరగతి మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని, వారికి అధిక మొత్తంలో హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరించడం వారి ఆరోగ్యంతో ఆడుకోవడం, దోపిడీ చేయడం కాదా అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా మహిళల ప్రాణాలను పణంగా పెడుతూ సాగుతున్న ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
