AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరియు రాబోయే పంచాయతీ ఎన్నికల వ్యూహంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘనవిజయం తమ రెండున్నరేళ్ల పరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదముద్ర అని ఆయన అభివర్ణించారు. ఇదే ఉత్సాహంతో రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఏకగ్రీవాలతోనే గ్రామాల వేగవంతమైన అభివృద్ధి
గ్రామాల సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ చోట్ల ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని మంత్రులు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎన్నికల పోటీ వల్ల గ్రామాల్లో అనవసర విభేదాలు తలెత్తకుండా, అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవం చేసుకుంటే ఆయా గ్రామాలకు అదనపు నిధులు సమకూరుతాయని స్పష్టం చేశారు.
ప్రోత్సాహక నిధులపై విస్తృత ప్రచారం
ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం పెంచిన ప్రోత్సాహక నిధుల వివరాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ ప్రోత్సాహక నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మరింత వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కూటమి నేతలు సమన్వయంతో పనిచేసి పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసేలా కృషి చేయాలని సీఎం ఆదేశించారు.
