Free Education: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు సింగరేణి పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ ఉచిత విద్యా సౌకర్యాన్ని అమలు చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.
ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు
ఈ నిర్ణయం మేరకు సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ, జీఎం (పర్సనల్) అన్ని సింగరేణి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు కార్మికుల పిల్లల చదువుకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అవసరమైన ధృవపత్రాలు ఇవే
ఉచిత విద్యా సదుపాయం పొందేందుకు కార్మికులు తమ ఎంప్లాయీ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు ప్రభుత్వ అధికారులు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జిరాక్స్ పత్రాలను పాఠశాలల్లో అందజేయాలని సూచించారు. ఆయా పత్రాలను పరిశీలించి, అర్హులైన విద్యార్థులందరికీ ఉచిత విద్యా సదుపాయాన్ని కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంట్రాక్టు కార్మికులు, కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
