మినిట్ 2 మినిట్ డెస్క్, చిత్తూరు:
రాజకీయం అంటే జనం. వాళ్ల సమస్యలు, వాళ్ల అభివృద్ధి చుట్టూ తిరిగేదే అసలైన రాజకీయం. అయితే నేడు కులం, మతం చుట్టూ రాజకీయాన్ని తిప్పుతూ, అక్కడే కాలం గడిపేస్తున్నారు కొందరు. ఈ రెండో కోవకు చెందిన వారికి బొత్తిగా ప్రజాసమస్యలు పట్టవు. చిత్తూరుకు చెందిన కె. వరుణ్ కుమార్ ఆ మొదటి దారిలోనే వెళుతున్నారు. ఓ విజన్‌తో తన డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో నాయకత్వానికి అసలైన కొలమానం అధికారం మాత్రమేనన్న భావనను తొలగిస్తూ, ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. స్థానిక సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తూ, ప్రజా సంక్షేమమే ఊపిరిగా ముందుకు సాగుతున్నారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్. స్థానిక 16వ డివిజన్ దుర్గానగర్ కాలనీని నగరంలోనే ఒక అగ్రగామి ‘మోడల్ డివిజన్’గా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని చాటుతున్నారు.
శాసనసభ్యుల సహకారం.. అభివృద్ధితో మారుతున్న ముఖచిత్రం
రెండు దశాబ్దాల పాటు విభిన్న రాజకీయ పరిణామాలను చూసిన ఈ ప్రాంతంలో, ఇప్పుడు అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ సంపూర్ణ సహకారం, మార్గదర్శకత్వంతో దుర్గానగర్ కాలనీ రూపురేఖలు రూపాంతరం చెందుతున్నాయి. ఉచిత మంచినీటి ట్యాంకర్ల సరఫరా ద్వారా తాగునీటి ఎద్దడిని తీర్చడం, ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి నిరంతర చర్యలు ప్రజలకు ఎంతో ఊరటనిచ్చాయి. నాయకుడు స్వయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుంటుండడం వల్ల, ఈ డివిజన్లో రాజకీయం కంటే అభివృద్ధి చర్చే ప్రముఖంగా వినపడుతోంది.
ధైర్యంగా గడప గడపకూ.. ‘ఇంటింటికీ తెలుగుదేశం’
‘‘చెప్పింది చేస్తున్నాం.. కాబట్టే ధైర్యంగా గడప గడపకూ వెళ్తున్నాం!’’ అన్న ధీమా వరుణ్ కుమార్ పనితీరుకు నిదర్శనం. ప్రస్తుతం శ్రేణులతో కలిసి నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో ప్రతి ఇంట్లోనూ లభిస్తున్న ఆత్మీయ స్వాగతం, క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న సుముఖతను, సంతృప్తిని చాటిచెబుతోంది. సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన నేరుగా ప్రజల వద్దకు చేరుతుండటంతో ప్రతి ఇంటిలోనూ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది.
‘‘మీరు ప్రచారానికి రాకపోయినా పర్లేదు.. మేమే గెలిపించుకుంటాం!’’
ప్రచార సమయంలో కాలనీవాసులు చెప్పిన – ‘‘మీరు ప్రచారానికి రాకపోయినా పర్లేదు, మిమ్మల్ని మేమే గెలిపించుకుంటాం’’ అనే మాటలు కేవలం ఒక హామీ మాత్రమే కావు, అది ఒక ప్రజా నాయకుడిపై ప్రజలు పెట్టుకున్న అపరిమితమైన నమ్మకం. కూటమి ప్రభుత్వం పనితీరుపై, స్థానిక నాయకత్వంపై ప్రజలలో ఎంతటి సానుకూల వాతావరణం ఉందో చెప్పడానికి ఈ ఒక్క మాట నిదర్శనంగా నిలుస్తోంది. ‘My Place My People’ (నా ప్రాంతం – నా ప్రజలు) అనే ఆత్మీయ భావనతో డివిజన్ ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా భావించి సేవలందిస్తుండడమే ఈ స్థాయి ఆదరణకు మూలకారణం.
స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి, కాలనీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సీనియర్ కార్యకర్తలతో పాటు యువతను, మహిళలను కలుపుకొని పోతూ, వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటున్న వరుణ్ కుమార్ పనితీరు సరికొత్త రాజకీయనమూనాను ఆవిష్కరిస్తోంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా, అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం దుర్గానగర్ కాలనీకి సరికొత్త వెలుగులను తీసుకువస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు!
