IAS KRISHNA TEJA: 365 రోజుల తపన!

అలుపెరుగని కఠోరశ్రమ, క్రమశిక్షణ
ఏడాది పాటు ఒక్క రోజు కూడా విరామం లేకుండా ప్రాక్టీస్!
ఐఏఎస్ కృష్ణ తేజ విజయం వెనుక అసలు రహస్యం!

మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 07): కలలు కనడం అందరూ చేస్తారు, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి ప్రతిరోజూ క్రమశిక్షణతో శ్రమించేవారు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. జీవితంలో లేదా వృత్తిలో ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే తాత్కాలిక ఆలోచనలు కాదు, నిరంతర శ్రమ, గట్టి పట్టుదల అవసరం. ఐఏఎస్ కృష్ణ తేజ జీవితం మనకు నేర్పించే పాఠం ఇదే. “లక్ష్యం వైపు సాగే ప్రయాణంలో ప్రతిరోజూ చేసే చిన్న ప్రయత్నమే, రేపటి మహత్తర విజయానికి పునాది!” అవుతుందని ఆయన నిరూపించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని చేరుకోవడానికి ప్రతిరోజూ క్రమశిక్షణతో శ్రమించడం అంతే ముఖ్యమనే మాటలకు నిలువెత్తు రూపం ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ. యూపీఎస్సీ (UPSC) సివిల్స్ సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవడమే కాకుండా, తన సమర్థవంతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన విజయ ప్రయాణం నేటి ప్రతి ఒక్క యువకుడికీ ఒక గొప్ప దిశానిర్దేశం.

ఏడాది పాటు అలుపెరగని పట్టుదల!
సివిల్స్ పరీక్షల్లో విజయం అనేది కేవలం జ్ఞానంతోనే కాదు, నిలకడ, కఠోరశ్రమతోనే సాధ్యమవుతుందని కృష్ణ తేజ చేసి చూపించారు. సివిల్స్ సన్నాహక సమయంలో ఆయన అనుసరించిన వ్యూహం అత్యంత ఆదర్శవంతమైనది. ప్రతిరోజూ ఉదయం సరిగ్గా 4:30 గంటలకే నిద్రలేచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు. ఇలా ఏకంగా ఒక సంవత్సరం పాటు (365 రోజులు) ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా, ఎటువంటి అలసత్వానికి తావివ్వకుండా సాధన చేశారు. ఈ రకమైన తీవ్రమైన స్వయం నియంత్రణ, సమయపాలనే ఆయనను విజేతగా నిలబెట్టాయి. ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్చుకుని, తనదైన వ్యక్తిత్వంతో తిరుగులేని విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మూడు సార్లు వెనకబడ్డా, నాలుగో ప్రయత్నంలో మొండి పట్టుదలతో 2014లో సివిల్స్‌లో 66వ ర్యాంకు పొందారు. అనంతరం 2015లో కేరళ క్యాడర్ లభించింది.

వరదల్లో ప్రత్యక్ష దైవంలా.. నీరాజనాలు!

సాధారణంగా అధికారిక వ్యవస్థల్లో వినిపించే కలెక్షన్ అనే పదానికి, అర్థాన్నే మార్చేశారు కృష్ణతేజ. కేరళలోని ఆలప్పుళ జిల్లా సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో వచ్చిన భయంకరమైన వరదల వేళ కృష్ణ తేజ చూపిన ధైర్యం, చొరవ అపూర్వం. సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యూహాత్మక ప్రణాళికలను సమర్థవంతంగా ఉపయోగిస్తూ ప్రాణాపాయంలో ఉన్న దాదాపు 2 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా, ‘ఐ యామ్ ఫర్ అలెప్పి’ అనే సామాజిక కార్యక్రమం ద్వారా అతి తక్కువ సమయంలో వేలాది మంది బాధితులకు అవసరమైన సహాయక సామగ్రిని సేకరించి పంపిణీ చేశారు. ఆయన అందించిన సేవలకు గాను అక్కడి ప్రజలు ఆయనను ఆప్యాయంగా ‘కలెక్షన్ కలెక్టర్’ అని పిలుచుకున్నారు.