భారత రక్షణ రంగానికి మరో బలం
జెట్ ఆధారిత డ్రోన్ ‘దివ్యాస్త్ర Mk3’ పరీక్ష సఫలం
క్షిపణి శైలిలో శత్రు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం
స్వదేశీ ఆత్మనిర్భర్ రక్షణ రంగానికి కీలక అడుగు
మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ(ఆగస్ట్ 17): భారత రక్షణ సాంకేతిక రంగంలో మరో కీలకమైన మైలురాయి నమోదైంది. ప్రముఖ సాంకేతిక అంకుర సంస్థ కావ్ యూఏవీ ప్రైవేట్ లిమిటెడ్ (హోవరిట్) రూపొందించిన నూతన తరం జెట్ ఆధారిత లాయ్టరింగ్ మ్యూనిషన్ ‘దివ్యాస్త్ర Mk3’ తొలి ప్రయోగాత్మక విమాన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఆధునిక ఆయుధ వ్యవస్థ శత్రు లక్ష్యాలను అత్యంత వేగంగా, అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రయోగం విజయం సాధించడంతో భారత సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు, త్రివిధ దళాలకు ఆధునిక వ్యూహాత్మక డ్రోన్ శక్తిని అందించేందుకు మార్గం మరింత సుగమమైంది.
ఈ ప్రయోగం దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ సామర్థ్యానికి నిదర్శనమని కంపెనీ సహ వ్యవస్థాపకులు వ్యాఖ్యానించారు. సంక్లిష్టమైన జెట్ ఆధారిత ప్రిసిషన్ స్ట్రైక్ వ్యవస్థను పూర్తి స్వయం ప్రతిపత్తితో దేశంలోనే వేగంగా రూపొందించి పరీక్షించగలమని భారత్ మరోసారి నిరూపించిందన్నారు. ‘దివ్యాస్త్ర Mk3’ నిజమైన ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని, భవిష్యత్ యుద్ధరంగ వ్యూహాల్లో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
