నేహా బోరా.. అగ్గి బరాటా!
ప్రశ్నలు సంధిస్తూ, ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శిస్తూ..
దేశ రాజకీయాల్లో యువ కెరటం
యూత్ పాలిటిక్స్‌లో నయా ఐకాన్
ఉద్వేగభరిత ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న యువతి
నిన్నటి జెన్ జీ ఉద్యమంలో కీలక పాత్రధారి
మినిట్ 2 మినిట్, పొలిటికల్ డెస్క్: నేహా బోరా.. ఎగిరే ధిక్కార పతాకం. ప్రశ్నించే స్వభావాన్ని నరనరాన నింపుకున్న కమ్యునిజం ఆమె సిద్ధాంతం. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలే తన అడుగుజాడలయ్యాయి. జంతర్ మంతర్ వద్ద 23 రోజుల నిరాహార దీక్ష నుంచి జేఎన్ యూ వీధుల దాకా… ప్రశ్నించే స్వభావాన్ని నరనరాన నింపుకుని, సిరా చుక్కల దాడిని సైతం జాతీయ ఉద్యమంగా మలుస్తున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా జీవన ప్రస్థానంపై మినిట్ 2 మినిట్ ప్రత్యేక కథనం.
ప్రశ్నలను సంధిస్తూ.. ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శిస్తూ.. యూత్ పాలిటిక్స్‌లో నయా ఐకాన్‌గా ఎదిగిన యువ కెరటం నేహా బోరా. ఉత్తరాఖండ్‌లోని ఖతీమా ప్రాంతంలో జన్మించిన నేహా బోరా ప్రయాణం అనేక మలుపులతో కూడుకున్నది. తండ్రి భారత సైన్యంలో సేవలు అందించడంతో ఆమె చిన్నతనం విభిన్న నగరాలు, సంస్కృతుల నడుమ గడిచింది. ఉత్తర బెంగాల్‌లో చదువుకుంటున్న సమయంలోనే పబ్లో నెరూడా, చారు మజుందార్, అరుంధతీ రాయ్ రచనల ద్వారా ప్రజా ఉద్యమాల పట్ల ఆకర్షితురాలైంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన నేహా, ప్రస్తుతం ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్‌లో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్ స్టడీస్‌పై పీహెచ్‌డీ పరిశోధన చేస్తోంది.
కమ్యూనిజం సిద్ధాంతం.. రంగస్థలం నుంచి విప్లవ వేదిక దాకా!
కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నాటకరంగ కళాకారిణిగా, సామాజిక వేదికలపై ప్రశ్నించే స్వభావాన్ని పెంచుకున్న నేహా బోరా, కమ్యూనిజాన్ని తన సిద్ధాంత భావజాలంగా మలచుకుంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, దేశంలో విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ, పేపర్ లీకేజీలు, NEET పరీక్షల్లో అక్రమాలు, పౌర హక్కుల హరణంపై ఎలుగెత్తి చాటింది.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పేపర్ లీకేజీ అక్రమాలపై విద్యార్థులు, యువత చేపట్టిన ‘జెన్ జీ’ ఉద్యమంలో నేహా బోరా అత్యంత కీలక పాత్ర పోషించింది. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి ఆమె ఏకంగా 23 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టి తన ఆత్మవిశ్వాసాన్ని చాటింది. నిరాహార దీక్షలో శారీరకంగా క్షీణించినా, ఆమె ఉపన్యాసాల పదును పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆమె సృష్టించిన స్ఫూర్తితోనే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి, పాలకవర్గం దిగివచ్చేలా చేసింది.
దాడికి గురైనా వెనక్కి తగ్గని వీరనారి!
ఇటీవల జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో, కొందరు వ్యక్తులు ఆమెపై సిరా చల్లి అవమానించే ప్రయత్నం చేశారు. కానీ, ఆ సిరా చుక్కలతోనే భావితరాల చరిత్రను తిరగరాస్తానని బలంగా ప్రకటిస్తూ, ఆమె దేశవ్యాప్తంగా నగరాలను చుడుతూ విద్యార్థులను సమీకరిస్తోంది. ప్రశ్నించే ప్రతీ గొంతును నొక్కేయాలని చూస్తున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, నేహా బోరా రూపంలో కొత్త తరానికి ఒక ఆశ, ధిక్కార పతాకం కనిపిస్తోంది.
