22A పొరపాట్లను సరిదిద్దుతున్నాం..
ప్రజలకు పూర్తి రక్షణ మాదే!
24 గంటల్లోనే 34 రిజిస్ట్రేషన్లు పూర్తి..
సమస్య పరిష్కార ప్రక్రియ ప్రారంభం
దరఖాస్తుల పరిశీలనకు అధికారులతో ప్రత్యేక కమిటీ..
15 రోజుల పాటు నిరంతర పర్యవేక్షణ
రాజకీయ లబ్ధి కోసం తప్పుదోవ పట్టించవద్దన్న మంత్రి పొంగులేటి
మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 19): 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంలో సాంకేతిక లోపాల వల్ల జరిగిన పొరపాట్లను ఇందిరమ్మ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందని, సామాన్య ప్రజల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత తమదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సమస్య పరిష్కారంలో భాగంగా గత 24 గంటల్లోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 చొప్పున మొత్తం 34 రిజిస్ట్రేషన్లను పూర్తి చేశామని మంత్రి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో వివరాలు అప్లోడ్ చేసే సమయంలో క్షేత్రస్థాయి అధికారుల వల్ల తప్పులు దొర్లాయని, బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఆ పొరపాటును పారదర్శకంగా అంగీకరించి సరిదిద్దుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో జీవోలు, మెమోల ద్వారా క్రమబద్ధీకరించిన భూములు, జీహెచ్ఎంసీ, హెచ్ఎమ్డీఏ అనుమతులు ఉన్న స్థలాలు ఈ జాబితాలోకి వచ్చాయని, వాటన్నింటినీ వెంటనే సరిచేసి రిజిస్ట్రేషన్లు పునరుద్ధరిస్తున్నామని వివరించారు.
ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ రాబోయే 15 రోజుల పాటు రోజూ దరఖాస్తులను పరిశీలించి జెన్యూన్ ప్రైవేట్ ఆస్తులకు తక్షణమే క్లియరెన్స్ ఇస్తుందని పేర్కొన్నారు. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా పోకుండా చూస్తామని, ఈ అంశంపై విపక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
