22Aపై సీఎం రేవంత్ రెడ్డి అభయం!
నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశం
రెండు రోజుల్లో రెవెన్యూ అధికారుల సమగ్ర పరిశీలన..
దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి
శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు
మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 19): రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల శాఖలో నిషేధిత భూముల (22A) జాబితా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బుధవారం ఆయన తన నివాసంలో నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రైవేటు భూయజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడం, ఈ వ్యవహారంలో ఉన్న చట్టపరమైన చిక్కులను అధిగమించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు భూముల యాజమానులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని గట్టి భరోసానిచ్చారు. నిషేధిత భూముల జాబితాపై రాబోయే రెండు రోజుల్లో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి మరియు రికార్డుల పరిశీలన చేపడతారని తెలిపారు. ఒకవేళ సదరు భూమి జెన్యూన్ ప్రైవేటు ఆస్తి అని తేలితే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఉన్న 22A జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఏళ్ల తరబడి నలుగుతున్న ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో నిషేధిత భూముల పేరుతో దళారులు, మధ్యవర్తులు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు ఎవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, సామాజిక మాధ్యమాలు మరియు బయట ప్రచారంలో ఉన్న పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. పౌరుల ఆస్తి హక్కుల పరిరక్షణకు, పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
