చిన్నారి వైద్య ఖర్చులు భరిస్తానని హామీ
మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 20): తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన చిన్నారి అభిమానికి టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని కొండంత అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన శశిభవ్యత అనే చిన్నారి గత కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతోంది. ఆ చిన్నారికి రామ్ అంటే ఎనలేని అభిమానం. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలియడంతో స్పందించిన రామ్, బుధవారం నేరుగా వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరలోనే స్వయంగా వచ్చి కలుస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా, చిన్నారి వైద్యం, మందులు, ఆహారానికి అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని అభయమిచ్చారు. మాట వరుసకే కాకుండా ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించి ‘రియల్ హీరో’ అనిపించుకున్నారు. రామ్ చేసిన ఈ ఉదార సాయంపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
