సెప్టెంబర్ 5న ఛలో ఢిల్లీ!
‘కాక్రోచ్ జనతా పార్టీ’ భారీ నిరసన ప్రదర్శనకు పిలుపు!
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం లాంగ్ మార్చ్
ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు పాదయాత్ర
పాఠశాలల బాగు కోసం ఏం చేస్తున్నారంటూ విద్యాశాఖ మంత్రులకు లేఖ!
మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 25): యువతకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. జూలై 25న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ఆధారంగానే అప్పట్లో దేశవ్యాప్త నిరసనలను విరమించామని, అయితే ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని పార్టీ విమర్శించింది. ఈ వైఖరిని నిరసిస్తూ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి న్యూఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఈ ఆందోళనకు నీట్ పరీక్షల వివాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబ సభ్యులు, పోలీసు దాడుల బాధితులు ముందుండి నాయకత్వం వహిస్తారని తెలిపింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, వేలాది మంది యువతీ యువకులు పాల్గొంటారని స్పష్టం చేసింది.
స్కూళ్ల బాగు కోసం చర్యలేవి?: అభిజీత్ దీప్కే సంచలన లేఖ
మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, అధ్వాన పరిస్థితులపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు బహిరంగ లేఖ రాశారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, బెంచీల వంటి మౌలిక సదుపాయాల మెరుగు కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ప్రాథమిక సదుపాయాలు లేకపోతే దేశం ఎలా పురోగమిస్తుందని ఆయన ప్రశ్నించారు.
