సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
వరుసగా 4 రోజులు సేవలు బంద్!
మినిట్ 2 మినిట్, నేషనల్ డెస్క్(ఆగస్ట్ 25): వారానికి 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌లోని అంతరాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ (యుఏఎఫ్‌బీఐ) సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకుల్లో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది.
సెప్టెంబర్ 11న శుక్రవారం నాటి సమ్మెతో పాటు, తర్వాతి రెండు రోజులు (సెప్టెంబర్ 12, 13) సాధారణ శని, ఆదివారాల సెలవులు రానున్నాయి. అలాగే సెప్టెంబర్ 14న వినాయక చతుర్థి పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. 2024 మార్చిలో ఐబీఏతో కుదిరిన ఒప్పందం ప్రకారం వారానికి 5 రోజుల పనిదినాల కోసం రోజూ పనివేళలను 40 నిమిషాలు పెంచేందుకు తాము సిద్ధపడినా, రెండేళ్లుగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పెండింగ్‌లోనే ఉంచిందని యూనియన్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఎల్ఐ స్కీమ్ ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలను పెంచుతోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల సమ్మె, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగకుండా ఉండాలంటే ముందస్తుగానే అవసరమైన నగదు, లావాదేవీలు పూర్తి చేసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
