CM REVANTH REDDY: అమెరికా పర్యటన రద్దు రాజకీయ కుట్ర.!

అమెరికా పర్యటన రద్దు రాజకీయ కుట్ర.!

గుజరాత్ సీఎంతో పాటు పర్యటనకు కేంద్రం ఓకే చెప్పింది

దేశానికి కాకుండా ఇప్పటికీ గుజరాత్ సీఎంగానే ప్రధాని మోడీ

ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన తీవ్ర అవమానం!

అమెరికా పర్యటనను కావాలనే అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 25):  అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం వెనుక గుజరాత్ ఆధిపత్యం, రాజకీయ కుట్ర దాగి ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. విద్యా, క్రీడలు, పెట్టుబడుల రంగాలు లక్ష్యంగానే తమ అమెరికా పర్యటన ప్లాన్ చేశామని, నిబంధనల ప్రకారమే అప్లికేషన్ ఇచ్చినా కేంద్రం తిరస్కరించిందని మండిపడ్డారు.

‘వైబ్రెంట్ గుజరాత్’ పేరుతో గుజరాత్ సీఎం ఎనిమిది రోజుల అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతులిచ్చిన కేంద్రం.. తెలంగాణ సీఎం పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌ మొత్తానికి ప్రధానిలా కాకుండా, ఇప్పటికీ గుజరాత్ సీఎంగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తే గుజరాత్‌కు ఆగిపోతాయనే భయంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ విచక్షణ పరిణామం రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అడ్డుకోవడమేనన్నారు. ఈ విషయంలో స్థానిక బీజేపీ ఎంపీలు గుజరాత్‌కు సపోర్ట్ చేస్తున్నారా లేక తెలంగాణ అభివృద్ధికా అని నిలదీశారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని సీఎం రేవంత్ దుయ్యబట్టారు.

కొండా సురేఖ ఇష్యూను హైకమాండ్ చూసుకుంటుంది!

ఇదే సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె వివాదస్పద వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీ డిసిప్లినరీ కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తోందని, అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణే అత్యంత ప్రాధాన్యమని, ఎవరైనా సరే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.