“నిజమైన మనుషులు ఎక్కడ ఉన్నారు?” వివేకానంద ప్రశ్నకు RK మఠం ‘యువ సమ్మేళనం’లో లభించిన సమాధానం ఇదే!

Ramakrishna Math

Ramakrishna Math Hyderabad Hosts VIHE 27th Youth Convention

Ramakrishna Math: హైదరాబాద్‌లోని ప్రముఖ రామకృష్ణమఠంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ (VIHE) 27వ వార్షికోత్సవ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ‘యువ సమ్మేళనం’ పేరిట నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి నగరంలోని వివిధ విద్యాసంస్థల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మానవీయ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం, న్యూఢిల్లీ రామకృష్ణమిషన్ కార్యదర్శి స్వామి సర్వలోకానంద మహారాజ్, డెక్స్టరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు శరత్ వివేక్ సాగర్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. స్వామి సర్వలోకానంద మహారాజ్ మాట్లాడుతూ.. “దేశమును ప్రేమించమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా” అన్న మహాకవి గురుజాడ అప్పారావు సూక్తిని గుర్తుచేస్తూ, దేశాన్ని ప్రేమిస్తేనే నిస్వార్థమైన సేవ సాధ్యమవుతుందని యువతకు ఆశీస్సులందించారు.

మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మహారాజ్ మాట్లాడుతూ.. “కహా హై మానుష్” (నిజమైన మనుషులు ఎక్కడ ఉన్నారు?) అని స్వామి వివేకానంద ప్రశ్నించారని, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన యువత ద్వారానే స్వాతంత్ర్య పరిరక్షణ, సమాజ పురోగతి సాధ్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ రామకృష్ణమఠం తొలి అధ్యక్షులు, వీఐహెచ్ఈ వ్యవస్థాపకులు స్వామి రంగనాథానంద మహారాజ్ సేవలను స్మరించుకున్నారు. వారికి వినమ్రపూర్వక అంజలి ఘటించారు.

వాస్తవ చరిత్రను అధ్యయనం చేయాలి: ఎల్.వి. సుబ్రహ్మణ్యం
మాజీ సీఎస్ ఎల్.వి. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ.. బలమైన దేశ నిర్మాణం జరగాలంటే ప్రతి ఒక్కరూ ప్రాచీన భారతీయ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటీషర్లు రాసిన అవాస్తవ చరిత్రను కాకుండా, మన దేశ మూలాలను, గొప్పతనాన్ని అధ్యయనం చేసినప్పుడే యువతలో సరైన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.