Telangana: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వివాదాస్పద జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థుల నిరసన మహా రణరంగంగా మారింది. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నూతనంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ (యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ) పరిధిలోకి బదిలీ చేయొద్దంటూ గత 20 రోజులకు పైగా పాఠాలు వదిలేసి పోరాడుతున్న విద్యార్థులు గురువారం తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.
గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత, తోపులాట
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో విద్యార్థులంతా ఏకమై కళాశాల ఆవరణ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించారు. ముందస్తు సమాచారంతో అక్కడకు చేరుకున్న భారీ పోలీసు బృందాలు వారిని కళాశాల గేటు వద్దే అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల నడుమ తీవ్ర స్థాయి తోపులాట జరిగి విద్యార్థులు కిందపడిపోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితి చెయ్యి దాటకుండా ఉండేందుకు పోలీసులు మెయిన్ గేట్లు మూసివేసి, మీడియాను సైతం లోపలికి వెళ్లకుండా నిషేధించారు.
భవిష్యత్తు దెబ్బతింటుందనే ఆందోళన
పాలిటెక్నిక్‌ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల ఫీజుల భారం పెరగడంతో పాటు బి.టెక్ డైరెక్ట్ ల్యాటరల్ ఎంట్రీ (ECET) అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాంకేతిక విద్యా మండలి (SBTET) పరిధిలోనే కళాశాలలను కొనసాగించాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
