నాడు స్వేచ్ఛ కోసం.. నేడు స్వచ్ఛ పాలన కోసం.. జెన్ జీ వందేమాతరం!

GenZ Movement

GenZ Movement

GenZ Movement: వందేళ్ల క్రితం నాటి ‘వందేమాతరం’ ఉద్యమ స్ఫూర్తితో నేటి జెన్ జీ (Gen Z) తరం నవభారత నిర్మాణం దిశగా ముందడుగు వేస్తోంది. నేటి రాజకీయాలు కేవలం పదవుల వేట, అపార ఆస్తుల సముపార్జన, కోట్లాది రూపాయల వ్యాపారాలుగా మారిపోయాయి. ఎన్నికల వేళ ఉచితాల ఎరవేసి ఓట్లు పొందడం, అధికారం దక్కిన తర్వాత ప్రజల అవసరాలను విస్మరిస్తూ మభ్యపెట్టడమే పరమావధిగా రాజకీయ నాయకత్వం సాగుతోంది. కానీ స్వాతంత్ర్య పోరాట చరిత్రను ఒక్కసారి తిరగేస్తే.. ఈ మట్టి కోసం, ఈ దేశ ప్రజల ఉజ్వల స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలు సైతం త్యాగం చేసిన నిస్వార్థ వీరులు మనకు కనిపిస్తారు. ఖుదీరామ్ బోస్, భగత్ సింగ్ వంటి యువకిషోరాలు దేశభక్తి తోడుగా నవ్వుతూ ఉరికంబమెక్కారు.

చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి వీరులు బ్రిటిష్ పాలకుల ఫిరంగి తూటాలకు, తుపాకీ గుళ్లకు ఎంతమాత్రం వెరవకుండా వీరమరణం పొందారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకంగా విప్లవ సైన్యాన్ని సమీకరించి ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వెన్నులో వణుకు పుట్టించారు. ఒకవైపు మహాత్మా గాంధీ సత్యం, అహింసా మార్గంలో పోరాటాలు సాగిస్తే, నాటి వీర యువతీయువకులు వందేమాతర నినాదంతో ప్రత్యక్ష విప్లవ పంథాను ఎంచుకున్నారు. నాటి నాయకుల పోరాట మార్గాలు భిన్నమైనప్పటికీ వారి అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే.. అదే భారతమాత సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు.

అయితే నాటి త్యాగధనులు కన్న నవభారత స్వప్నాలు నేటి స్వార్థ రాజకీయాల నీడలో కల్లలవుతున్నాయి. నేటితరం రాజకీయ నాయకులు నవతరానికి కళ్లకు గంతలు కట్టి తమ స్వార్థ రాజకీయ లబ్ధి పొందేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆలోచిస్తున్న జెన్ జీ తరానికి ‘వందేమాతరం’ పోరాటమే ఆదర్శంగా నిలుస్తోంది. నేటి యువతరం నాటి ఖుదీరామ్, భగత్, ఆజాద్, అల్లూరిల విప్లవ వారసత్వాన్ని గుండెల్లో పదిలంగా రగిలించుకుంటోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నిజమైన స్వేచ్ఛాయుత భారత్ కోసం, అవినీతి రహిత సమాజ స్థాపన కోసం శ్రమిస్తోంది.

ఈ భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత రికార్డుల వైపు నిలవాలన్నదే నేటి జెన్ జీ తరం ఆలోచన. తాత్కాలిక సంక్షేమ పథకాల పేరుతో వేసే ఉచితాల ఎరలను నిరసిస్తూ, స్వయంసమృద్ధి కలిగిన నిజమైన స్వరాజ్యం కోసం నవభారత చైతన్య యువత గళమెత్తుతోంది. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన స్వార్థ వ్యవస్థపై పోరాడుతూ, సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఈ తరం ముందుకు సాగుతోంది. నాటి పోరాట యోధుల మహోన్నత త్యాగాలను స్మరిస్తూ, భారతమాతకు నిజమైన స్వేచ్ఛను అందించేందుకు ఈ తరం యువత నినదిస్తోంది.