పదవి ఊడినా తగ్గేదేలే.. కొండా సురేఖ హాట్ కామెంట్స్!

Konda Surekha

Konda Surekha

Konda Surekha: మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారి వరంగల్ వేదికగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కార్యకర్తలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, ప్రజల్లో నిరంతరం నిలిచేవాళ్లే అసలైన నాయకులని స్పష్టం చేశారు. ఎంపీటీసీ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగిన తన ప్రయాణంలో కష్టకాలంలో కార్యకర్తలే కొండంత అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు.

గతంలో ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ బంధం కడవరకు కొనసాగేదని, కానీ నేడు రాజకీయాల్లో ఆవకాశవాదం పెరిగిపోయిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కోసం మంత్రి పదవికి కూడా ఆలోచించకుండా రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి తమ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడారని తెలిపారు. అయితే ఆయన మరణం తర్వాత పార్టీలోని కొందరు నేతలు తమను కావాలని టార్గెట్ చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేసినప్పుడు తొలిసారిగా ఆయనకు మద్దతు ఇచ్చింది తానేనని, కాంగ్రెస్‌కు రేవంత్ లాంటి మాస్ లీడర్ అవసరమని తానే కోరుకున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో కొండా మురళి మాట్లాడుతూ, తమకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని, తమ రక్తంలోనే కృతజ్ఞత దాగి ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తన భార్య కొండా సురేఖను క్షమాపణ చెప్పాలని కొందరు సూచించినా.. పదవి ఉంటే ఉండనీ, పోతే పోనీ అని సురేఖ సారీ చెప్పలేదని గుర్తుచేశారు. తమ దృష్టిలో పదవులు శాశ్వతం కాదని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇప్పించేందుకు శ్రమిస్తామని కొండా దంపతులు ధీమా వ్యక్తం చేశారు.