జన్వాడ ఫామ్‌హౌస్‌పై ‘హైడ్రా’ కన్ను.. కాంగ్రెస్ ఫిర్యాదుతో తీవ్రమైన రాజకీయ దుమారం

Janwada Farmhouse

Janwada Farmhouse

Janwada Farmhouse:  తెలంగాణ రాజకీయాల్లో జన్వాడ ఫామ్‌హౌస్ వివాదం మళ్లీ తీవ్ర దుమారం రేపుతోంది. రంగారెడ్డి జిల్లాలోని వివాదాస్పద జన్వాడ ఫామ్‌హౌస్‌ను ప్రత్యక్షంగా పరిశీలించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం.. నిబంధనల ఉల్లంఘనపై ఏకంగా ‘హైడ్రా’ (HYDRAA) కమిషనర్‌తో పాటు స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారం సరికొత్త మలుపు తీసుకుంది.

కాంగ్రెస్ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం.. జన్వాడ ఫామ్‌హౌస్ ఉన్న భూములన్నీ నిజానికి సత్యం రామలింగరాజుకు చెందిన ‘శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్’కు చెందినవి. 111 జీవో నిబంధనల కింద ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వారు గుర్తుచేశారు. నిబంధనలకు సంపూర్ణంగా విరుద్ధంగా, స్థానిక నాలాను ఆక్రమించి ఈ ఫామ్‌హౌస్ నిర్మించారని ఆరోపించారు. గతంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించిన సమయంలోనే ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ఈ నిబంధనల ఉల్లంఘన జరిగిందని కాంగ్రెస్ ప్రతినిధులు ధ్వజమెత్తారు.

సర్వే నంబర్లు 301, 311, 313లలోని భూములను కేటీఆర్ తన బాల్య మిత్రుడు ప్రదీప్ రెడ్డితో పాటు ఇతరుల పేర్లపైకి అక్రమంగా మార్చారని కాంగ్రెస్ బృందం ఆరోపించింది. సర్వే నంబర్ 301లో 3 ఎకరాల 2 గుంటల భూమి కేటీఆర్ సతిమణి శైలిమ పేరిట, మరొక 18 గుంటల భూమి కేటీఆర్ అత్త పొకాల శోభ పేరిట ఉందని స్పష్టం చేశారు. 13 ఎకరాల నిషేధిత భూమిని బినామీల ద్వారా ఎలా విడిపించారో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలోనే ఈ అక్రమాలపై డ్రోన్ కెమెరాలతో కవరేజ్ చేసి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఈ అక్రమ నిర్మాణాలను, చెరువుల ఆక్రమణలను ప్రజలందరికీ తేటతెల్లం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. హైడ్రా రంగంలోకి దిగితే జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయోనని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.