Nani Paradise: సన్సేషనల్ హిట్ ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, వైవిధ్యమైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ గురువారం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. నైజాం రీజియన్‌లో బుకింగ్స్ షురూ అయిన కొద్ది గంటల్లోనే రూ.1 కోటికి పైగా గ్రాస్ వసూళ్లు నమోదు కావడం ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోయేలా చేస్తోంది.
టికెట్ల వేటలో రికార్డుల హోరు
గత రాత్రి డిస్ట్రిక్ట్ యాప్ వేదికగా అడ్వాన్స్ బుకింగ్స్‌కు తెరలేవగానే అభిమానులు, ప్రేక్షకులు టికెట్ల కోసం క్యూ కట్టారు. క్షణాల వ్యవధిలోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడైపోవడం సినిమాపై ఉన్న పిచ్చి క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. ప్రధాన కేంద్రాల్లోని మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్లలోనూ పలు షోలు ఇప్పటికే ‘హౌస్‌ఫుల్’ బోర్డులు తగిలించుకున్నాయి. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ రెంజిలో వచ్చిన రెస్పాన్స్ చూసి చిత్రబృందం అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది.
మాస్ గెటప్‌లో నాని..
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈసారి కూడా బలమైన యాక్షన్ ఎలిమెంట్స్, విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతీష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నాని ఇప్పటివరకు చేయని సరికొత్త, రగ్గడ్ గెటప్‌లో కనిపించనుండటం అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కథానాయికగా కయాదు లోహర్ అలరించనుండగా, వర్సటైల్ యాక్టర్ మోహన్ బాబు పవర్ఫుల్ విలన్ పాత్రలో మెరవనున్నారు. రాఘవ్ జుయల్, తనికెళ్ల భరణిలు కీలక పాత్రలు పోషిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అతిపెద్ద అసెట్‌గా మారనున్నాయి.
నేడే ప్రీ-రిలీజ్ వేడుక: సర్ ప్రైజ్ కోసం ఈగర్‌గా ఫ్యాన్స్
సినిమా విడుదలకు సమయం దగ్గరపడటంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచిన మేకర్స్, నేడు హైదరాబాద్‌లోని ప్రముఖ శిల్పకళా వేదికలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ వేడుకలో అభిమానుల కోసం ఒక స్పెషల్ ‘సర్ ప్రైజ్’ దాగి ఉందంటూ చిత్రబృందం ఊరిస్తుండటంతో ఈ ఈవెంట్‌పై అందరి దృష్టి నెలకొంది. విజువల్స్, నాని విశ్వరూపం, అనిరుధ్ మ్యూజిక్ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలంటే ఈ గురువారం వరకు ఆగాల్సిందే..
