‘మినిట్ 2 మినిట్’ కథనం ప్రభావం.. వారం తిరక్కముందే మారిన మ్యాన్‌హోల్స్ రూపం!

Manhole Fixed

Manhole Fixed

Manhole Fixed: ప్రజా సమస్యలపై ‘మినిట్ 2 మినిట్’ ఎక్కుపెట్టిన అక్షరాస్త్రానికి అధికారుల నుంచి తక్షణ స్పందన లభించింది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్ల పరిస్థితిపై గత నెల 29న ‘మినిట్ 2 మినిట్’ దినపత్రికలో “పేరు గొప్ప.. ఊరు దిబ్బ!” శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.

రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైందని, స్థానికులే హెచ్చరికగా కుండలు, హెల్మెట్లు పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందని పత్రిక వేలెత్తి చూపింది. ఈ కథనానికి జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. వార్త ప్రచురితమైన వారంలోపే అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, సదరు ప్రమాదకర స్థలంలో నూతన కాంక్రీట్ మ్యాన్‌హోల్ మూతలను ఏర్పాటు చేసి రహదారిని పునరుద్ధరించారు.

రోజువారీ రాకపోకలు సాగించే వేలాది మంది వాహనదారులు, బాటసారులు ఈ మార్గంలో నిత్యం భయాందోళనలతో ప్రయాణించేవారు. ఇప్పుడు కొత్త మ్యాన్‌హోల్ మూతలు అమర్చడంతో ప్రమాదాల ముప్పు తప్పిందని, ప్రశాంతంగా ప్రయాణిస్తున్నామని వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ, బాధితుల గళాన్ని అధికారులకు వినిపించడంలో ‘మినిట్ 2 మినిట్’ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. త్వరితగతిన స్పందించి మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేసిన అధికారులకు, నిరంతరం ప్రజా సమస్యలను వెలికితీస్తున్న ‘మినిట్ 2 మినిట్’ యాజమాన్యానికి స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.