బ్లాక్‌మెయిల్ బజార్‌.. రియల్ ఎస్టేట్‌ను పీక్కుతింటున్న రాబందులు!

Real Estate Extortion

Real Estate Extortion

Real Estate Extortion: రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చే భారీ ప్రాజెక్టులు కొందరికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి! నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘వాసవి ఆనంద నిలయం’ వంటి ప్రాజెక్టులు నేడు కేవలం ఇండ్లు కొనుగోలు చేసే బాధితుల సమస్యగానే కాకుండా.. వివిధ వర్గాల అక్రమ సంపాదనకు అడ్డాగా మారాయనే చర్చ ఇప్పటిది కాదు. యూట్యూబ్ ఛానెళ్లతో పాటు కొన్ని శాటిలైట్ ఛానెళ్లు, రాజకీయ వర్గాలు, బ్లాక్‌మెయిలర్లు.. ‘దోచుకున్నోడికి దోచుకున్నంత’ అన్నట్లుగా ఈ వెంచర్‌ను తమ సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

సమాజంలో జవాబుదారీతనంగా ఉండాల్సిన కొన్ని వ్యవస్థలు నేడు బ్లాక్‌మెయిలింగ్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. లీగల్ లొసుగులు, నిబంధనల సాకులు వెతుక్కుంటూ రియల్టర్లు, కాంట్రాక్టర్లను టార్గెట్ చేయడం కొందరికి నిత్యకృత్యంగా మారింది. మీడియా ముసుగులో కొందరు డిజిటల్, శాటిలైట్ ప్లాట్‌ఫారమ్ నిర్వాహకులు, ప్రజాస్వామ్య వ్యవస్థల తెరచాటున మరికొందరు రాజకీయ నేతలు తమ చేతిలో ఉన్న అధికారాన్ని, ప్రచార బలాన్ని ఉపయోగించి బిల్డర్ల నుంచి కోట్ల రూపాయలు రాబట్టినట్లు సమాచారం. చిన్న లూప్ హోల్ దొరికినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ, బెదిరింపులకు దిగి ముక్కుపిండి వసూలు చేసే నైజం పెరిగిపోయిందనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.

బిల్డర్లు, కాంట్రాక్టర్లు, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకుల నడుమ సాగుతున్న ఈ అంతర్గత ‘రాబందుల ఆట’లో చివరకు నష్టపోతున్నది మాత్రం సామాన్య కస్టమర్లే. జీవితకాల కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసి, సొంతింటి కల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు ఈ వసూళ్ల రాజకీయం వల్ల ప్రాజెక్టులు ఆలస్యమై తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఒకవైపు బ్లాక్‌మెయిలర్ల దోపిడీ, మరోవైపు ప్రాజెక్టుల మందగమనం నడుమ కస్టమర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత తనిఖీ సంస్థలు ఇటువంటి అక్రమ వసూళ్ల ముఠాలపై కఠిన చర్యలు తీసుకుని, రియల్ ఎస్టేట్ రంగాన్ని, కస్టమర్ల హక్కులను కాపాడాల్సిన అత్యవసరత ఉంది.