పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి అక్కడ రాజకీయ దాడులు ఆగడం లేదు. విపక్ష తృణమూల్ కాంగ్రెస్ (TMC) కీలక నేతలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అభిషేక్ బెనర్జీ, కొందరు మాజీ మంత్రులపై భౌతిక దాడులు జరగ్గా.. తాజాగా టీఎంసీ ఫైర్‌బ్రాండ్, మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై దాడి కలకలం రేపింది.
పశ్చిమ బెంగాల్‌లోని ఒక దుకాణం వద్ద మహువా మొయిత్రా తన పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడుతుండగా, కొందరు దుండగులు ఆమెపై కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ విషయాన్ని ఎంపీ స్వయంగా ధ్రువీకరించారు. అధికార బీజేపీ కార్యకర్తలే ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో బెంగాల్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కాగా, మహువా మొయిత్రా చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ నాయకత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.
