తెలంగాణ కళా మణికి గౌరవ డాక్టరేట్.. బి. నర్సింగరావుకు అంబేడ్కర్ వర్సిటీ సత్కారం

B Narsing Rao

B Narsing Rao

B Narsing Rao: తెలంగాణ కళా, సాంస్కృతిక రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖ సినీ దర్శకుడు, కవి, చిత్రకారుడు బి. నర్సింగరావును గౌరవ డాక్టరేట్‌తో సత్కరించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్ణయించింది. విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నేడు జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా పాల్గొని నర్సింగరావుకు ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు.

ఈ సందర్భంగా విసి డాక్టర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ బి. నర్సింగరావు తెలంగాణకు గర్వకారణమని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. సినీ దర్శకుడు, రచయిత, చిత్రకారుడు, ఛాయాగ్రాహకుడు, రంగస్థల కళాకారుడు, సంగీతకారుడిగా ఆయన చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందన్నారు.

‘మా భూమి’, ‘మా ఊరు’, ‘దాసి’, ‘మట్టి మనుషులు’ వంటి గొప్ప చిత్రాల ద్వారా తెలంగాణ భూదృశ్యాలు, మాండలికాలు, జానపద సంప్రదాయాలు, సామాజిక వాస్తవాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేశారని ప్రశంసించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించే ఈ గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తున్నట్లు చక్రపాణి వెల్లడించారు.