GO 86: ప్రాణాలకు తెగించి మంటల్లోకి దూకి నిమిషాల్లో వందలాది ప్రాణాలను, కోట్ల విలువైన ఆస్తులను కాపాడే అగ్నిమాపక (ఫైర్) సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా? కష్టజీవులకు అండగా నిలవాల్సిన సర్కారు, అనాలోచిత నిర్ణయాలతో వారి కడుపు కొడుతోంది. అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఫైర్‌మెన్ల పాలిట ‘జీవో నెం. 86’ ఒక శాపంగా మారి, వారి ఉద్యోగ జీవితాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ జీవో దెబ్బతో ఒకే పోస్టులో చేరిన సిబ్బందికి జీతాల్లో పెను వ్యత్యాసం ఏర్పడింది. కొందరికి జీతాలు పెంచి, మరికొందరికి మొండిచేయి చూపించడమే కాకుండా.. ఏకంగా రిటైర్మెంట్ అయ్యే వరకు వేతన పెంపు (ఇంక్రిమెంట్) లేకుండా చేసే దుస్థితిని కల్పించింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై కనీస అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం లేని కొందరు అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని రాసిన జీవోలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో అనడానికి ఈ నిబంధనే సజీవ సాక్ష్యం.
రెగ్యులర్ ఫైర్ విధులు నిర్వహించే ఫైర్ ఫైటర్లకు వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలంటే కచ్చితంగా ‘హెవీ డ్రైవింగ్ లైసెన్స్’ ఉండాలని నిబంధన పెట్టడం అధికారుల అజ్ఞానానికి అద్దం పడుతోంది. ఉద్యోగంలో చేరినప్పుడు (జాయినింగ్ ఆర్డర్‌లో) లేని ఈ వింత రూల్‌ను మధ్యలో తెచ్చి, డ్రైవింగ్ లైసెన్స్ లేదనే నెపంతో సగం మంది సిబ్బందికి వేతన పెంపును నిలిపివేశారు. మంటలు ఆర్పే ఫైర్ ఫైటర్‌కూ, భారీ ఫైర్ ఇంజిన్ నడిపే డ్రైవర్‌కూ ఉన్న వృత్తిపరమైన వ్యత్యాసాన్ని కూడా గుర్తించకుండా అధికారులు జీవో ఎలా జారీ చేశారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కనీస విచక్షణ లేకుండా అధికారులు ప్రతిపాదించిన ఈ వింత ఫైల్‌పై ప్రభుత్వ పెద్దలు కళ్ళు మూసుకుని సంతకాలు చేసి ఆమోదించారా అని ఫైర్ సిబ్బంది కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకరికేమో ఇంక్రిమెంట్లు ఇచ్చి, పక్కనే ప్రాణాలకు తెగించి పనిచేసే తోటి సిబ్బంది ఉసురు పోసుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఫైర్ సిబ్బంది పాలిట శాపంగా మారిన జీవో 86ను తక్షణమే ఉపసంహరించాలని, అర్హులైన ఫైర్‌మెన్లందరికీ న్యాయంగా రావాల్సిన ఇంక్రిమెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
