Youth Power: ‘దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంద’ని నాయకులు వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు వినడానికి బాగానే ఉంటాయి. కానీ, ఆచరణలో చూస్తే నేటి యువత పరిస్థితి అత్యంత విచారకరంగా మారింది. ఎన్నికలొస్తే చాలు.. కాస్త బిర్యానీ ప్యాకెట్, ఓ బీరు బాటిల్, బైకులో ఐదు వందల రూపాయల పెట్రోల్ పోస్తే చాలు, ఏ నాయకుడి వెనుకైనా జెండాలు పట్టుకుని ర్యాలీల్లో తిరిగే స్థాయికి యువశక్తి దిగజారిపోతోంది. జైకొట్టే గొంతులుగా, కటౌట్లు కట్టే చేతులుగానే యువతను రాజకీయనాయకులు వాడుకుంటున్నారు.
అభివృద్ధి నేతల ఇళ్లల్లోనేనా?
నాయకులను నమ్ముకుని, వారి జెండాలు మోస్తూ, ప్రత్యర్థులతో గొడవలు పెట్టుకుని కేసులు ఎదుర్కొంటున్నది సగటు మధ్యతరగతి, పేద యువకులే. ఈ ఊడిగం వల్ల నాయకుల కుటుంబాలు, వారి పిల్లలు కార్లలో తిరుగుతూ, కార్పొరేట్ చదువులు చదువుతూ ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. మరి వారి వెనుక తిరిగిన యువకుల పరిస్థితి ఏమిటి? పదేళ్లు గడిచినా, పాతికేళ్లు వచ్చినా అదే చౌరస్తాలో “దేహీ” అంటూ నాయకుల దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. చదువుకున్న ఉద్యోగస్థులు సహితం సమాజం పట్ల బాధ్యత మరచి, వీకెండ్ సరదాలు, మస్తీల్లో మునిగితేలుతూ ఈ అన్యాయాన్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
చైతన్యమే ఏకైక మార్గం!
యువత ప్రశ్నించడం మరిస్తే ప్రజాస్వామ్యం నిర్వీర్యమైపోతుంది. మీ ఆలోచనా విధానం మారాలి. జెండాలు మోసే కేడర్లా కాకుండా, ప్రశ్నించే లీడర్లా మారాలి. ఉద్యోగాలు, ఉపాధి, నాణ్యమైన విద్య, వైద్యం, ప్రాంతీయ అభివృద్ధి గురించి నాయకులను నిలదీయాలి. తాత్కాలికమైన ఆకర్షణలకు లొంగిపోకుండా, స్వయం సమృద్ధిని సాధిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం గొంతుక విప్పాలి. యువత మేల్కొని తమ హక్కుల కోసం, బంగారు భవిష్యత్తు కోసం పోరాడినప్పుడే రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుంది. సమాజాన్ని నడిపించే శక్తులుగా మారేందుకు యువత ఇకనైనా అడుగు ముందుకు వేయాలి.
