జంతర్ మంతర్‌కు గుడ్ బై.. ఢిల్లీలో నిరసనలకు ఇక ఆ మూడు ప్రాంతాలే వేదికలు

Jantar Mantar

Jantar Mantar

Jantar Mantar: దేశ రాజధాని ఢిల్లీలో దశాబ్దాలుగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు ప్రధాన కేంద్రంగా ఉన్న జంతర్ మంతర్‌పై ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్‌ను నిరసనల జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై అక్కడ ఎలాంటి ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడానికి వీల్లేకుండా కఠిన నిషేధం విధిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రతిరోజూ వివిధ రాజకీయా పార్టీలు, సంఘాలు జంతర్ మంతర్ వద్ద చేపట్టే నిరసనల వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పాటు స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులు తెలిపారు. భద్రతా కారణాలు, విఐపిల కదలికలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో పౌరుల నిరసన తెలిపే రాజ్యాంగబద్ధ హక్కును పరిరక్షిస్తూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల ఆధారంగా ప్రత్యామ్నాయంగా 3 కొత్త ప్రదేశాలను నిరసన వేదికలుగా నిర్దేశించారు.

రాంలీలా మైదానం, బురాడీ మైదానం, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్‌ను అధికారిక ధర్నా వేదికలుగా ప్రకటించారు. ముందస్తు అనుమతితోనే ఈ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది నీట్ పేపర్ లీకేజీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జరిగిన ఆందోళనలు, ఇటీవల ఎస్‌ఐఆర్ వివాదంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహించిన నిరసనలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.