Amrapali Cadre: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటా కేడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ పూర్తయింది. ఈ వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె ఏ కేడర్కు బదిలీ అవుతారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) గత ఏడాది జూన్లో ఆమ్రపాలిని తెలంగాణ కేడర్కు కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. డిఓపీటీ దాఖలు చేసిన పిటిషన్పై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం.. క్యాట్ ఇచ్చే ఉత్తర్వుల అమలుపై తాత్కాలిక స్టే విధించింది.
హైకోర్టు విధించిన ఆ స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి తిరిగి అదే కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం అలాగే ఆమ్రపాలి తరఫు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలను ఆలకించింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. త్వరలోనే తుది తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది.
