జెండా కింద జల్సాలు.. తెరవెనుక బేరసారాలు.. విద్యార్థి ముసుగులో సాగుతున్న ‘బ్లాక్‌మెయిల్’ దందా!

Student Unions

Student Unions

Student Unions: ప్రైవేట్ విద్యాసంస్థలు, కొన్ని నకిలీ విద్యార్థి సంఘాల నాయకుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఓ రహస్య నాటక రంగాన్ని తలపిస్తుంటాయి. ఈ రెండు వర్గాల మధ్య నిజమైన వైరం ఉందో, లేక లోపాయికారీ స్నేహం ఉందో అర్థం కాని ఓ విచిత్రమైన వాతావరణం విద్యావ్యవస్థలో రాజ్యమేలుతోంది. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, ఫీజుల దోపిడీపై పోరాటం పేరిట జెండాలు పట్టే అనేక సంఘాల అసలు రంగు.. ప్రైవేట్ కళాశాలల యజమానుల నుంచి అందే ‘రహస్య నజరానాల’ వద్దే బయటపడుతోంది.

కలెక్షన్ల కోసమే తనిఖీ నాటకాలు

పైకి చూస్తే ప్రైవేట్ కాలేజీలపై కత్తులు నూరుతున్నట్టు, ధర్నాలు, ముట్టడులతో విరుచుకుపడుతున్నట్టు పెద్ద ఎత్తున హడావుడి చేస్తారు. కానీ, తెర వెనుక జరిగే కథ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల లేమి, అదనపు ఫీజులు, అనుమతుల ఉల్లంఘనలు ఉన్నాయని గుర్తించడమే ఆలస్యం.. కొందరు సంఘాల నేతలకు అది ఒక పెద్ద వ్యాపార అవకాశంగా మారిపోతోంది. ఆందోళనల పేరుతో మీడియాను పిలిచి రచ్చ చేయడం, యాజమాన్యాలను భయభ్రాంతులకు గురిచేయడం.. ఆ వెంటనే ప్రిన్సిపాల్ గదుల్లో లేదా రహస్య ప్రదేశాల్లో ఏకాంత చర్చలకు దిగడం నిత్యకృత్యమైంది.

చేతికందగానే గప్‌చుప్

కాలేజీ గేట్ల ముందు విద్యార్థి నినాదాలతో హోరెత్తించిన నాయకులే, లోపల నాలుగు రూపాయలు చేతికందగానే ‘సెటిల్మెంట్’ కుదుర్చుకుని ఏమీ తెలియనట్టు గప్‌చుప్ అయిపోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలు ఆదర్శాలకు, సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండేవి. కానీ నేడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కొన్ని ప్రైవేట్ సంఘాలు కేవలం విద్యాసంస్థలను పీల్చి పిప్పి చేసి డబ్బులు గుంజడమే పనిగా పెట్టుకున్నాయి. డొనేషన్ల పేరిట, ఈవెంట్ల ఖర్చుల పేరిట, ఫండ్స్ పేరుతో అడ్డగోలుగా లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారు.

యాజమాన్యాలు కూడా తమ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు బయటపడకుండా ఉండేందుకు ఈ సంఘ నాయకులకు అడిగినంత ముట్టజెప్పి నోళ్లు మూయిస్తున్నాయి. దీంతో విద్యార్థుల అసలు సమస్యలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రజాస్వామ్య పోరాటాలను కూడా వ్యాపారంగా మార్చేసి, విద్యార్థి జెండాను కలెక్షన్లకు వాడుకుంటున్న ఈ ‘నకిలీ’ చెలిమి వ్యవస్థపై నిజమైన విద్యార్థి లోకం, విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.