Custard Apple: నోరూరించే మధురమైన సీతాఫలాల సీజన్ ప్రారంభమైనప్పటికీ, ఈసారి సీతాఫలం ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. నిన్నటి మొన్నటి వరకు రోడ్ల పక్కన విరివిగా లభించే ఈ పండ్లు ఈ ఏడాది మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, దానికి తోడు సీతాఫల చెట్లను పట్టిన తెగుళ్లు, ఇతర చీడపీడల కారణంగా ఈసారి సీతాఫల దిగుబడి గణనీయంగా పడిపోయింది.
వర్షాల వల్ల పువ్వు రాలిపోవడమే కాకుండా, కాయలు సరిగా పెరగకముందే చెట్లపైనే కుళ్ళిపోయాయని రైతులు, సేకరణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ వంటి ప్రాంతాల నుంచి వచ్చే సీతాఫలాల రాక తీవ్రంగా తగ్గింది. సాధారణంగా రోజుకు వేల సంఖ్యలో వచ్చే గంపల స్థానంలో ప్రస్తుతం కొద్దిపాటి దిగుబడి మాత్రమే మార్కెట్కు చేరుతోంది.
సామాన్యుడికి సీతాఫలం దూరం
దిగుబడి తగ్గి డిమాండ్ పెరగడంతో సీతాఫలాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో ఒక్కో పండు రూ. 10 నుంచి 20 లభించగా, ప్రస్తుతం పరిమాణాన్ని బట్టి మార్కెట్లో ఒక్కో సీతాఫలం రూ. 30 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తున్నారు. డజను పండ్ల ధర రూ. 300 నుండి రూ. 500 వరకు పలకడంతో సామాన్యుడు కొనుగోలు చేయలేక వెనకడుగు వేస్తున్నాడు. ప్రకృతి ప్రసాదించిన ఈ తీపి ఫలం ఈసారి చేతికి దక్కకుండా పోయిందని వినియోగదారులు వాపోతున్నారు.
