అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారిన స్నాక్స్ యూనిట్లు.. 4 సంస్థల లైసెన్సులు రద్దు!

Food Safety

Food Safety

Food Safety: కాటేదాన్ సమీపంలోని ప్రేమావతి పేటలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (టీజీ సేఫ్) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ‘సాహిల్ ఫుడ్స్’కు చెందిన 5 స్నాక్స్ తయారీ కేంద్రాల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో తీవ్ర స్థాయిలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 4 యూనిట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను అధికారులు తక్షణమే సస్పెండ్ చేసి, వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు.

ఈ తనిఖీల్లో సరైన లేబుల్స్ లేని సుమారు 55 టన్నుల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 33.94 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. ఆహార పదార్థాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవ్వడంతో మొత్తం 11 నమూనాలను సేకరించి, సమగ్ర పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. తయారీ యూనిట్లలో ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన వెంటిలేషన్ లేకపోవడాన్ని తనిఖీ బృందం గుర్తించింది. అలాగే తయారీ కేంద్రంలోని కొందరు సిబ్బంది గుట్కా, పాన్ మసాలా నములుతూ కనిపించడం గమనార్హం.

మరొకవైపు ఆహార పదార్థాలను నేరుగా నేలపై నిల్వ చేయడం, సింథటిక్ ఫుడ్ కలర్లను తీవ్ర అపరిశుభ్రమైన బకెట్లలో ఉంచడం వంటి అనేక లోపాలను అధికారులు పట్టుకున్నారు. ఉత్పత్తుల తయారీ, విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, లైసెన్సుల్లో సరైన ఫుడ్ కేటగిరీలు లేకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ప్రజలు ఏవైనా ఆహార పదార్థాలను కొనుగోలు చేసే ముందు వాటి లేబుల్స్, తయారీ తేదీలు, శుభ్రతను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచించారు.