Illegal Borewells: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వేసిన నాలుగు అక్రమ బోర్లను రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. అధికారుల కన్నుగప్పి రాత్రికి రాత్రే బోర్లు వేసేందుకు ప్రయత్నించిన ఫ్లాట్ యజమానులకు రెవెన్యూ బృందం గట్టి షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో సమయస్ఫూర్తితో, బాధ్యతాయుతంగా వ్యవహరించి అక్రమాలను అరికట్టిన హయత్ నగర్ ఆర్ఐ రవికుమార్ పనితీరుపై స్థానిక ప్రజలు, కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.
సూర్యనగర్ కాలనీలోని ఫ్లాట్ యజమానులు ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుందనే నెపంతో శనివారం రాత్రి 10:00 గంటల సమయంలో దొంగచాటుగా బోర్వెల్ తవ్వకాలను ప్రారంభించారు. తెల్లవారుజాము కల్లా పనులన్నీ పూర్తి చేసేస్తే అధికారులకు సమాచారం వెళ్లే అవకాశం ఉండదని భావించారు. అయితే, స్థానిక జర్నలిస్టుల ద్వారా సమాచారం అందుకున్న హయత్ నగర్ ఆర్ఐ రవికుమార్ తక్షణమే స్పందించారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు, ఆర్ఐ రవికుమార్ తన తోటి అధికారి ఎంఆర్‌ఐ సాయినాథ్, సిబ్బందితో కలిసి సంయుక్తంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి వేసిన బోర్లను అధికారులు అక్కడికక్కడే సీజ్ చేసి అక్రమార్కుల ఆట కట్టించారు. అదే విధంగా వనస్థలిపురంలోనూ మరో రెండు బోర్లను సీజ్ చేసినట్టు ఆర్ఐ రవికుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ఐ రవికుమార్ ప్రదర్శించిన చొరవ, పారదర్శకమైన పనితీరు అధికారుల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. కేవలం స్థల యజమానులే కాకుండా అనుమతులు సరిచూసుకోకుండా తవ్వకాలు జరిపే బోర్వెల్ ఏజెన్సీలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, బోర్వెల్ యజమానులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. చట్టాన్ని ధిక్కరించి అక్రమ బోర్డులు వేస్తే ఎంతటి వారికైనా సీజింగ్ తప్పదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
