ఇంటింటికీ పాలు.. నేడు కోట్ల ఆస్తులు.. ఇంజినీరింగ్ సీట్ల దందాతో ముంచేసిన కేటుగాళ్లు!

Ranjeet Bhupally

Ranjeet Bhupally

Ranjeet Bhupally: నాలుగైదు సంవత్సరాల క్రితం ఇంటింటికీ తిరుగుతూ పాలు అమ్ముకున్న ఓ సాధారణ యువకుడు, నేడు కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతిగా ఎలా మారాడు? మంత్రుల పీఏలమని, సీనియర్ అధికారుల మనుషులమని చెప్పి ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్లను, విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ ఎలా కోట్లు సంపాదించాడు.? సికింద్రాబాద్ అడ్డాగా సాగిన ఈ అక్రమాలు.. నయా దోపిడీకి కేరాఫ్ అడ్రస్ అయ్యాయి. రంజీత్ భూపల్లి అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా సాగిస్తున్న ఈ దందా గురించిన సంచలన విషయాలపై మినిట్ 2 మినిట్ ప్రత్యేక కథనం.!

ఈబీసీ సర్టిఫికేట్ల దందా.. కౌన్సెలింగ్ సెంటర్ నెట్‌వర్క్

బీఎంఎస్ కన్సల్టన్సీ పేరుతో రంజీత్, ఆయన సహచరుడు శ్రీనివాస్ కలిసి సాగించిన అతిపెద్ద స్కామ్ ఇది. ఎలాంటి ప్రభుత్వ తనిఖీలు, వెరిఫికేషన్ లేకుండానే ఓసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు అక్రమంగా ఈబీసీ/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు కల్పించింది ఈ గ్యాంగ్‌. పాలిటెక్నిక్ కాలేజీలోని కౌన్సిలింగ్ సెంటర్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న  శ్రీనివాస్ సాయంతో అర్హులైన పేద విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలకు గండి కొట్టి, దొంగ దారిన నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఈబీసీ సర్టిఫికేట్లను ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ గడువు కంటే ముందే సర్టిఫికేట్లు వెబ్‌సైట్లలో ఎలా అప్‌లోడ్ అయ్యాయి? అధికారిక స్టాంపులు, సంతకాలను ఎలా దుర్వినియోగం చేశారు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇంజినీరింగ్ సీట్ల మాయాజాలం 

ఇంజినియరింగ్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని, సొంతంగా బిల్ బుక్కులు ముద్రించి భారీగా సొమ్ము కలెక్ట్ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ సంపాదనతో పద్మారావు నగర్‌లో రూ.3.5 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి, హాస్టళ్లకు అద్దెకు ఇచ్చినట్లు, విలువైన ఓపెన్ ప్లాట్లను, ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసినట్లు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు సాధారణ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ కట్టిన వ్యక్తికి, సేల్ డీడ్లలో కోట్ల రూపాయలను తెల్లధనంగా చెల్లించేంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది.

బాధితులు ముందుకు రావాలి.. పోలీస్, ఐటీ విచారణకు డిమాండ్

ఈ దందాపై ఉన్నత విద్యామండలి, పోలీస్ డిపార్ట్‌మెంట్, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లకు బాధితులు, విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. రంజీత్ భూపల్లి, శ్రీనివాస్ నెట్‌వర్క్ వల్ల మోసపోయిన విద్యార్థులు, తల్లిదండ్రులు లేదా కళాశాలల యజమానులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. బాధితులకు న్యాయం జరిగేలా, ఈ దొంగ సర్టిఫికేట్లు, ఆర్థిక నేరాల ముఠాపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేలా ‘మినిట్ 2 మినిట్’ నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నాం.